బంగాల్‌లో ఎనిమిది దశల్లో ఎన్నికలు నిర్వహించడాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తప్పుబట్టారు. భాజపా ప్రచారానికి వీలుగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సూచన మేరకు ఎన్నికల తేదీలను ప్రకటించారా? అని ఈసీని ప్రశ్నించారు దీదీ. ఎన్నికల తేదీల ప్రకటన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఒకే దశలో ఎన్నికలు జరుగుతుంటే.. బంగాల్‌లో మాత్రమే ఎనిమిది దశలు ఎందుకు అని మమత ప్రశ్నించారు. ఈసీనే న్యాయం చేయకపోతే ప్రజలు ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు. భాజపా కోరుకున్నట్లుగానే ఎన్నికల తేదీలు ప్రకటించారని తనకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందన్నారు. ప్రధాని, హోంమంత్రి తమ అధికారాలను దుర్వినియోగం చేయకూడదని హితవు పలికారు. ఎన్ని కుయుక్తులు పన్నినా బంగాల్ కుమార్తెగా ఈ రాష్ట్ర ప్రజలు తనకే మళ్లీ పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు మమత.
స్వాగతించిన ప్రతిపక్షాలు
బంగాల్‌లో ఎనిమిది విడతల్లో ఎన్నికలు నిర్వహించాలనే ఈసీ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు స్వాగతించాయి. దీంతో ఎన్నికలు స్వేచ్ఛగా, నిజాయితీగా జరుగుతాయన్నారు భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయప్రకాశ్ మజుందర్. ఓటర్లు ఎలాంటి భయాలకు గురికాకుండా.. వారి ఓటు హక్కును వినియోగించుకోగలుగుతారని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదని ఆరోపిస్తూ.. ఎన్నికలు కనీసం 10-12 దశల్లో జరగాల్సి ఉందని రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మనోజ్ చక్రవర్తి అన్నారు.
ఎలాంటి హింసకు తావు లేకుండా.. ఎన్నికలు ఎన్ని దశల్లో జరిగినా అభ్యంతరమేమీ లేదన్నారు సీపీఐ(ఎం) నేత సంజన్ చక్రవర్తి.
ఇదీ చూడండి: 'తృణమూల్‌కు ప్రజల కంటే రాజకీయాలే ఎక్కువ'