AP CM Jagan Cheated Employees : 2019 జూన్ 24న వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఏపీ సీఎం జగన్ ఎన్నో సుభాషితాలు చెప్పారు. అంగన్వాడీలు, ఆశావర్కర్లు, హోంగార్డులు వీరందరూ చిన్న చిన్న ఉద్యోగులని, వారిపట్ల చాలా ఉదారంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు వారే ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలు అమలు కాలేదంటూ పోరాటాలు చేస్తుంటే వారిపైనే కత్తికట్టారు. మరో మూడు నెలల్లో ఈ ప్రభుత్వం గడువు ముగుస్తున్నా ఇచ్చిన హామీలేవీ నెరవేర్చకపోవడంతో ఇప్పుడు రోడ్డెక్కారు.
Employees Protest Against YSRCP Government : డిమాండ్ల సాధనకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. జగన్ సర్కారు మెడలు వంచేందుకు కదం తొక్కుతున్నారు. అంగన్‌వాడీలు 2 వారాలుగా రోడ్డెక్కి పోరాడుతుంటే మంగళవారం నుంచి పారిశుద్ధ్య కార్మికులూ సమ్మెకు దిగారు. ఆశావర్కర్లు డిమాండ్ల సాధనకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిన్న మొన్నటి దాకా జగన్ సర్కారు అన్ని కార్యక్రమాలకూ ఎక్కువగా ఆధారపడుతున్న వాలంటీర్లూ షాక్ ఇచ్చారు. వారు సైతం సమ్మె నోటీసు ఇవ్వడం ఇప్పుడు సర్కారుకు మింగుడు పడడం లేదు.
అంగన్‌వాడీ సంఘాలతో ప్రభుత్వం చర్చలు విఫలం - రేపట్నుంచి ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద ధర్నాలకు పిలుపు
YSRCP Government Failed in Andhra Pradesh : అంగన్‌వాడీలకు తెలంగాణలో కంటే ఎక్కువ వేతనం ఇస్తానని బీరాలు పలికిన జగన్ అధికారంలోకి వచ్చాక నెలకు వెయ్యి రూపాయల చొప్పున వేతనం పెంచి చేతులు దులిపేసుకున్నారు. వారికి 4 వేల 200 ఉన్న గౌరవ వేతనాన్ని తెలుగుదేశం ప్రభుత్వం 2 విడతల్లో 150 శాతం పెంచి 10 వేల 500 చేసింది. జగన్ అధికారంలోకి వచ్చాక ఈ అయిదేళ్లలో వారికి పెంచింది కేవలం వెయ్యి మాత్రమే.
అంగన్‌వాడీల అరెస్టు : తెలంగాణలో 2021 జులైలో అంగన్‌వాడీల వేతనాన్ని 13 వేల 500కి పెంచినా జగన్ కిమ్మనలేదు. జగన్ సర్కారు వెయ్యి వేతనం పెంచడం వల్ల అంగన్‌వాడీలకు జరిగిన మేలు కంటే నష్టమే ఎక్కువ. వారి వేతనం 10 వేలకంటే ఎక్కువ ఉందని గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్‌వాడీలకు నవరత్నాల కింద ఇచ్చే సంక్షేమ పథకాలకు అనర్హుల్ని చేసేశారు. లక్షకుపైగా ఉన్న అంగన్‌వాడీలు వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తూనే ఉన్నా వారి గోడూ వినే ఓపిక లేకపోయింది. పైగా వారిపైనే పోలీసుల్ని ప్రయోగించి ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.
కొన్నిచోట్ల రాత్రిపూటా పోలీసుస్టేషన్లలో ఉంచారు. పనికి తగ్గట్టుగా తమకు వేతనాలు పెంచాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీని అమలు చేయాలని అంగన్‌వాడీలు చేస్తున్న ఆందోళనను జగన్ ప్రభుత్వం చెవికెక్కించుకోలేదు. మరోదారి లేక రోడ్డెక్కిన అంగన్‌వాడీల డిమాండ్లు నెరవేర్చడం కన్నా వారి గొంతు ఎలా నొక్కాలన్న దానిపైనే జగన్ ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టింది.
ప్రభుత్వ పథకాలు కోతలు : పారిశుద్ధ్య కార్మికులు చేసే పని మామూలుగా ఎవరూ చేయలేరు. వాళ్ల కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకోవాలి. వాళ్ల వేతనాల్ని 18వేలకు పెంచామని 2019 జూన్ 20న అసెంబ్లీలో జగన్ పలికిన చిలకపలుకులివి. వాస్తవానికి వారికి పెంచింది వేతనం కాదు. 6వేల చొప్పున ఆరోగ్యభృతి. అదీ నగర, పురపాలక సంస్థల్లోని పారిశుద్ధ్య కార్మికులకే ఇచ్చారు. ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే వారికి పెంచలేదు. పైగా పారిశుద్ధ్య కార్మికుల్ని ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ - ఆప్కాస్ పరిధిలోకి తెచ్చాక వారిని ఉద్యోగులుగా చూపించి ప్రభుత్వ పథకాలు కోసేశారు. ‘సమాన పనికి, సమాన వేతనం’కింద నెలకు 26వేల వేతనం, అదనంగా ఆరోగ్యభృతి ఇవ్వాలని, ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. సంక్షేమ పథకాలు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన సర్కారు ఇంత వరకు నెరవేర్చలేదని దాదాపు 50వేల మంది ఇప్పుడు సమ్మెకు దిగారు.
ఆశ నిరాశల మధ్య అగ్రిగోల్డ్ బాధితులు- హామీ విస్మరించిన జగన్
సర్కారుకు సమ్మె నోటీసులు : గ్రామ వాలంటీర్లకు, ఆశావర్కర్లకు హ్యాట్సాఫ్. వాళ్లు చేస్తున్న పనులు చాలా గొప్పవి. ఎవరూ చేయలేని పనులు వారు చేస్తున్నారు . ఇవన్నీ కొవిడ్ సమయంలో జగన్ వారిపై కురిపించిన ప్రేమ వాక్యాలు. కానీ ఆశా వర్కర్లు డిమాండ్ల సాధనకు ఎప్పుడు గొంతెత్తినా నొక్కేస్తూనే ఉన్నారు. ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో వారు ఆందోళన ఉద్ధృతం చేశారు. ఇప్పటికే సర్కారుకు సమ్మె నోటీసులు ఇచ్చిన వారు ఈ నెల 14, 15 తేదీల్లో అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపట్టారు.
అంగన్‌వాడీల సమ్మెకు మద్దతుగా వారు మంగళవారం పలుచోట్ల ర్యాలీలు చేశారు. జనవరిలో భారీ ఎత్తున చలో విజయవాడకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో 42వేల మంది ఆశావర్కర్లు ఉన్నారు. వీరంతా కనీస వేతనం చెల్లించాలని, పని భారాన్ని తగ్గించాలని, కమ్యూనిటీ హెల్త్‌వర్కర్లను ఆశాలుగా మార్చాలని, ప్రభుత్వసెలవులు, మెడికల్, మెటర్నిటీ లీవ్ ఇవ్వాలని డిమాండు చేస్తున్నారు.
భిక్షాటన చేసి నిరసన : సమగ్రశిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న పొరుగుసేవల ఉద్యోగులూ పోరుబాట పట్టారు. ‘సమాన పనికి- సమాన వేతనం ’ఇస్తామని ప్రతిపక్షనేతగా వారికి జగన్ హామీ ఇచ్చారు. దాన్ని పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ పొందుపరిచారు. తర్వాత మొండిచెయ్యి చూపారు. హామీ అమలు చేయాలంటూ ఎస్‌ఎస్‌ఏలోని సుమారు 12వేల మంది ఔట్‌సోర్సింగ్, పార్ట్‌టైం, కాంట్రాక్టు ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె మంగళవారం ఏడోరోజుకు చేరింది. ఉద్యోగులు వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నారు. మంగళవారం భిక్షాటన చేసి నిరసన తెలిపారు. నేడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతిపత్రాలు ఇవ్వాలని, ఆ తర్వాత ఆరుబయట వంటావార్పు కార్యక్రమం చేయాలని నిర్ణయించారు.
బెదిరింపులకు దిగుతున్న అధికారులు : కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో పని చేస్తున్న ఒప్పంద ఉద్యోగులు మినిమమ్ టైంస్కేల్ అమలు చేయాలంటూ నేటి నుంచి సమ్మెలోకి దిగుతున్నారు. సవరించిన వేతన స్కేళ్ల ప్రకారం వారికి మినిమమ్ టైం స్కేల్ అమలుచేయాలని 2022 జనవరి 17నే ఆర్థికశాఖ ఉత్తర్వులిచ్చినా ఇంతవరకూ అమలు చేయలేదు. మినిమమ్ టైం స్కేల్ అమలుచేశామని సీఎం గొప్పగా ప్రకటన మాత్రమే చేశారు. సుమారు 3వేల 500 మంది కేజీబీవీ ఒప్పంద ఉద్యోగులు మంగళవారం సమ్మె నోటీసు ఇచ్చారు. వారి సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు బెదిరింపులకు దిగుతున్నారు. సమ్మెకు వెళితే ఉద్యోగాల్లోంచి తొలగించి వేరేవారిని నియమించుకుంటామని ఎస్‌ఎస్‌ఏ ప్రాజెక్టు డైరెక్టర్ తమను బెదిరించినట్టు ఒప్పంద ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేశారు.
వాలంటీర్లలో మొదలైన అసంతృప్తి జ్వాల : జగన్ ప్రభుత్వానికి సొంత సైన్యంలా ఉన్న గ్రామ, వార్డు వాలంటీర్లకూ కడుపు మండింది. ప్రభుత్వం, పార్టీ అన్న తేడా లేకుండా అన్ని పనులకూ తమను వాడేస్తున్న సర్కారు శ్రమకు తగ్గ ప్రతిఫలం ఇవ్వడం లేదన్న కోపంతో వారు రగిలిపోతున్నారు. ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. రెండురోజుల క్రితం కృష్ణా జిల్లాలోని కొన్ని మండలాల వాలంటీర్లలో మొదలైన అసంతృప్తి జ్వాల కార్చిచ్చులా రాష్ట్రమంతా వ్యాపిస్తోంది.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని బహిష్కరణ : అనంతపురం, విజయనగరం, ప్రకాశం, ఏలూరు, పార్వతీపురం మన్యం తదితర జిల్లాల్లోని మండలాల్లో వాలంటీర్లు ఎంపీడీవోలకు మంగళవారం సమ్మె నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ, పార్టీ పనుల కోసం వాలంటీర్లపైనే ఆధారపడుతున్న జగన్ సర్కారుకు ఇది పెద్ద షాక్. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 65 వేల మంది వాలంటీర్లు ఉన్నారు. తమకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని 5వేల నుంచి 18వేలకు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, తమను స్వచ్ఛంద సేవకులుగా కాకుండా, ఉద్యోగులుగా గుర్తించాలని వారు డిమాండు చేస్తున్నారు.
భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని నిర్ణయం : విద్యుత్ సంస్థల్లో భవిష్యత్తులో జరిగే ఇంజనీర్ల నియామకాలకు కొత్త సర్వీసు నిబంధనలు, కొత్త కేడర్ వర్తింపజేయాలని యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యుత్ ఇంజనీర్ల సంఘం, ఏఈఈల సంఘం ఆందోళనబాట పట్టాయి. గత ఏడాది ఫిబ్రవరిలో విద్యుత్ ఉద్యోగుల ఐకాస, ఇంధన శాఖల ప్రతినిధులతో జరిపిన చర్చల్లో పాత నిబంధనల ప్రకారమే నియామకాలు చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోకపోవడంతో విద్యుత్ ఇంజినీర్లు ఆందోళన బాట పట్టారు. ఈ నెల 22న మధ్యాహ్న భోజన విరామ సమయంలో కార్యాలయాల వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వం దిగిరాకపోతే భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని వారు నిర్ణయించారు.
మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె సైరన్ - ప్రభుత్వానికి హెచ్చరిక