ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ పశువైద్యుడు అరుదైన శస్త్రచికిత్స చేశారు. పైనుంచి కిందిపడడం సహా కుక్కదాడి చేయడం వల్ల గాయపడిన తాబేలుకు ఆపరేషన్ చేశారా డాక్టర్. దీంతో తాబేలుకు ఈ తరహా వైద్యం చేసిన మొదటి వైద్యుడిగా గుర్తింపుపొందారు. 'టోటో' అని ముద్దు పేరు కలిగిన ఓ పెంపుడు తాబేలు పెంకుకు శస్త్రచికిత్స చేసి కుట్లు వేశారు డాక్టర్ విరామ్ వర్షణే. ఆ తాబేలుకు పునర్జన్మ ప్రసాదించారు.
అలీగఢ్‌లోని కాసింపుర్ ప్రాంతానికి చెందిన సుధీర్ అనే వ్యక్తి దాదాపు 3 సంవత్సరాలుగా ఓ తాబేలును పెంచుకుంటున్నాడు. దానికి ముద్దుగా 'టోటో' అని పేరు పెట్టాడు సుధీర్. టోటోను తన ఇంట్లో ఓ అక్వేరియంలో ఉంచి పెంచుకుంటున్నాడు. అయితే నెలరోజుల క్రితం టోటో అక్వేరియం నుంచి కింద పడింది. దీన్ని గమనించిన ఓ కుక్క.. టోటోపై దాడి చేసి తీవ్రంగా గాయపరచింది. ఫలితంగా టోటో కిందభాగంలో ఉన్న పెంకులో పగుళ్లు వచ్చాయి. అయితే సుధీర్ ఆ సమయంలో టోటోకు అయిన గాయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. గాయపడిన టోటోను మళ్లీ అక్వేరియంలో వేశాడు సుధీర్. టోటో నీటిలో ఉండడం కారణంగా దాని గాయం మరింత పెద్దదైంది. కొన్ని రోజులకు ఆ పగుళ్ల పాంత్రంలో ఇన్ఫెక్షన్ వ్యాపించింది. దీంతో ఆ ప్రాంతం నుంచి కొద్ది కొద్దిగా రక్తం రావడం మొదలైంది. దీన్ని గమనించిన సుధీర్.. వెంటనే టోటోను పశువైద్యుడు విరామ్ వర్షణే వద్దకు తీసుకువెళ్లాడు.
టోటోను పరీక్షించిన విరామ్ పగిలిన పెంకుకు శస్త్రచికిత్స చేయలని నిర్ణయించుకున్నారు. అయితే ఇలాంటి అరుదైన శస్త్రచికిత్సకు సంబంధించి ఎక్కడా సరైన పద్ధతులు లేవు. అందుకే టెక్నాలజీ సాయంతో కొత్త పద్ధతిలో చికిత్స చేయాలని ఫిక్స్ అయ్యారు. దీనికి గాను ఉక్కుతీగలను ఉపయోగించి.. వంకర పళ్లను కట్టి ఉంచడానికి ఉపయోగించే బ్రేస్ టెక్నిక్ ఆధారంగా టోటో పెంకుకు కుట్లు వేశారు డాక్టర్ విరామ్. అయితే టోటోకు ఈ అరుదైన ఆపరేషన్ చేయడం కోసం దాదాపుగా 3 గంటలపాటు శ్రమించినట్లు విరామ్ తెలిపారు. ఈ చికిత్స 25 రోజుల క్రితం చేసినట్లు డాక్టర్ విరామ్ వర్షణే వెల్లడించారు. ఆపరేషన్ చేసిన 20 రోజుల తర్వాత టోటో పెంకుకు వేసిన కుట్లువిప్పగా పగుళ్లు పూర్తిగా నయమైనట్లు గుర్తించారు. ప్రస్తుతం టోటో మునపటిలా ఈత కొడుతూ.. ఆరోగ్యంగా తిరుగున్నట్లు సుధీర్ తెలిపారు. ఇటువంటి అరుదైన శస్త్రచికిత్స చేసి తాబేలు ప్రాణాలు కాపాడినందుకు విరామ్ను జంతుప్రేమికులు, పశువైద్యులు అభినందిస్తున్నారు.