Amritsar Conjoined Twins Govt job: సాధించాలనే కృషి, పట్టుదల ఉంటే ఎంతటి కష్టమైనా.. విజయం మన చెంతకు చేరుతుందంటారు. దీనికి సాక్ష్యంగా నిలిచారీ ఇద్దరు. రెండు శరీరాలు అతుక్కొని పుట్టిన కవలలు.. ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. వారే పంజాబ్ అమృత్సర్కు చెందిన సోనా సింగ్, మోనా సింగ్. ప్రస్తుతం వీరు పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్లో (పీఎస్పీసీఎల్) పనిచేస్తున్నారు. సబ్స్టేషన్లో ఆర్టీఎంగా (రెగ్యులర్ టీ మేట్) పనిచేస్తున్న వీరికి నెలకు రూ. 20 వేల వేతనం అందుతోంది.

అవిభక్త కవలలైన వీరికి సాధారణ మనుషుల్లానే రెండు చేతులు, తల ఉన్నా కాళ్లు మాత్రం మొత్తం రెండే ఉండటం గమనార్హం. ఒకే శరీరం ఇద్దరు మనుషుల్లా అన్నమాట. అయినా.. వారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా, వైఫల్యాలు పలకరించినా చివరకు అనుకున్నది సాధించారు. చాలా మందికి అందని ద్రాక్షలా ఊరించే ప్రభుత్వ ఉద్యోగాన్ని ఒడిసిపట్టారు.
''ఈ ఉద్యోగం పొందినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. డిసెంబర్ 20న మేం ఇందులో చేరాం. మాకు ఈ అవకాశం దక్కినందుకు.. పంజాబ్ ప్రభుత్వానికి, మాకు చదువు నేర్పిన పింగిల్వాడా సంస్థకు కృతజ్ఞతలు చెబుతున్నాం.''
- మోనా సింగ్, సోనా సింగ్
ఈ రంగంలో ఇరువురికీ మంచి అనుభవం ఉందని, ఎంతో అంకిత భావంతో పనిచేస్తున్నట్లు చెబుతున్నారు సబ్స్టేషన్ జూనియర్ ఇంజినీర్ రవీందర్ కుమార్. సోనాకు ఉద్యోగం వచ్చిందని, అతనికి మోనా సాయం చేస్తాడని చెప్పారు.

''2021 డిసెంబర్ 20న వీరు ఉద్యోగంలో చేరారు. ఇక్కడ ఎలక్ట్రిక్ ఉపకరణాలను చూసుకుంటూ మాకు సహాయంగా ఉంటారు. పంజాబ్ ప్రభుత్వం వీరిని నియమించింది. సోనాకు ఉద్యోగం వచ్చింది. అతనితో కలిసి మోనా కూడా పని చేస్తాడు.''
- రవీందర్ కుమార్, సబ్స్టేషన్ జూనియర్ ఇంజినీర్
ఇదీ చూడండి: రూ.3 కోట్ల స్కాలర్షిప్తో అమెరికన్ వర్సిటీకి రైతు బిడ్డ