Amritsar Airport Covid Test: ఇటలీ నుంచి వచ్చిన విమానంలో గురువారం 125 మందికి వైరస్ సోకినట్లు తేలగా.. తాజాగా శుక్రవారం వచ్చిన మరో విమానంలోని 173 మందికి పాజిటివ్ అని నిర్ధరణ అయింది. రోమ్ నుంచి అమృత్‌సర్‌కు వచ్చిన 290 మంది ప్రయాణికుల్లో 173 మందికి పాజిటివ్ వచ్చింది. అధికారులు వారిని అమృత్‌సర్‌లోని వివిధ ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించారు. ఒమిక్రాన్ ముప్పున్న దేశాల్లో ఇటలీ కూడా ఉండటం వల్ల కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నిబంధనల మేరకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
13 మంది పరార్..
ఇటలీ నుంచి పంజాబ్ వచ్చిన ప్రయాణికుల్లో కరోనా పాజిటివ్ వచ్చిన 13 మంది పారిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. పరారైన వారి పాస్‌పోర్టులు రద్దు చేయనున్నట్లు అమృత్‌సర్ డిప్యూటీ కమిషనర్ గుర్‌ప్రీత్ సింగ్ తెలిపారు.
గురువారం సాయంత్రం ఆరోగ్య సిబ్బంది కళ్లుగప్పి 13 మంది పారిపోయినట్లు అధికారులు తెలిపారు. పాజిటివ్ వచ్చినవారు వెంటనే ఆస్పత్రులకు తిరిగి రావాలని, లేకపోతే వారి ఫొటోలను వార్తా పత్రికల్లో ప్రచురించనున్నట్లు డిప్యూటీ కమిషనర్ హెచ్చరించారు. ఇప్పటికే 13 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.
మిలాన్ నుంచి అమృత్‌సర్‌కు చార్టెర్డ్ విమానంలో వచ్చిన 179 మందిలో చిన్నారులు మినహా మిగతావారికి పరీక్షలు నిర్వహించగా 125 మందికి పాజిటివ్ వచ్చింది. వారందరినీ అమృత్‌సర్‌లోని వివిధ ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ వార్డులకు తరలించారు.
ఇదీ చూడండి : 'ఆ ప్రయాణికులకు హోం క్వారంటైన్ తప్పనిసరి'