అమితాబ్ బచ్చన్ పేరు మీద రిజిస్టరైన రోల్స్ రాయిస్ కారును బెంగళూరు ఆర్టీఓ అధికారులు విడిచిపెట్టారు. కారు యజమాని రూ.5,500 జరిమానా కట్టిన అనంతరం దానిని వదిలేశారు.
సరైన పత్రాలు లేకుండా రోడ్లపై తిరుగుతున్న బచ్చన్ పేరిట ఉన్న రోల్స్ రాయిస్ సహా 15 లగ్జరీ కార్లను గతవారం అధికారులు సీజ్ చేశారు.
ఇంకా అమితాబ్ పేరిటే..
అమితాబ్ బచ్చన్ పేరు మీద ఉన్న రోల్స్ రాయిస్ కారు.. బెంగళూరులో రెండేళ్ల నుంచి తిరుగుతున్నట్లు అధికారులు చెప్పారు. ఉమ్రా డెవలపర్స్ సంస్థ యజమాని బాబు.. అమితాబ్ బచ్చన్ నుంచి ఈ రోల్స్ రాయిస్ కారును రూ.1.3 కోట్లకు కొనుగోలు చేశారని అధికారులు తెలిపారు. అయితే.. ఇంకా ఆ కారు అమితాబ్ బచ్చన్ పేరిటే ఉన్నట్లు చెప్పారు.
నేలమంగళ ఆర్టీఓ కార్యాలయానికి వాహనం ట్యాక్స్ రిటర్న్స్, బీమ సహా పలు పత్రాలు తీసుకొచ్చి అధికారులకు చూపించారు బాబు. ఆయన వద్ద రూ.5500 జరిమానా కట్టించుకొని కారు ఇచ్చేశారు అధికారులు.
కాగా, 2007లో ప్రముఖ నిర్మాత విధువినోద్ చోప్డా ఈ కారును అమితాబ్‌కు బహుకరించారు. ఆ సమయంలో ముంబయిలో ఆర్టీఓలో రూ.35.29 లక్షలు జీవితకాల పన్ను చెల్లించారు బచ్చన్. 2019 ఫిబ్రవరిలో ఈ కారును బాబుకు విక్రయించారు.
ఇదీ చూడండి: సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇవి తెలుసుకోండి...