Amitabh Bachchan Ayodhya House : బాలీవుడ్ దిగ్గజ నటుడు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో స్థలం కొన్నారు. 10వేల చదరపు అడుగుల భూమిని దాదాపు రూ.14.5కోట్లకు కొనుగోలు చేశారు. ముంబయికి చెందిన స్థిరాస్తి సంస్థ 'హౌస్ ఆఫ్ అభినందన్ లోధా' అభివృద్ధి చేస్తున్న 'ది సరయు' ప్రాజెక్ట్‌లోనే ఈ స్థలం ఉంది. అమితాబ్ బచ్చన్ ప్లాట్ కొన్న విషయాన్ని ఆ సంస్థ ధ్రువీకరించింది. అయితే ఇందుకోసం ఆయన చెల్లిస్తున్నారనే సమాచారాన్ని మాత్రం ఇవ్వలేదు.
"అయోధ్యలోని 'ది సరయు' ప్రాజెక్ట్ కోసం 'ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా' గ్రూప్‌తో నా ప్రయాణం ప్రారంభించేందుకు ఎదురు చూస్తున్నాను. అయోధ్యకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిలో ఇల్లు కట్టునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను" అని అమితాబ్ బచ్చన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదే విషయమై ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా సంస్థ ఛైర్మన్ అభినందన్ లోధా ఓ ప్రకటన విడుదల చేశారు. అయోధ్య నగర ఆర్థిక భవిత, ఆధ్యాత్మిక వారసత్వంపై ఉన్న విశ్వాసాన్ని అమితాబ్ బచ్చన్ పెట్టుబడి ప్రతిబింబిస్తుందని తెలిపారు.
ప్రాణప్రతిష్ఠ రోజే ప్రాజెక్ట్ లాంఛ్
45 ఎకరాల విస్తీర్ణంలో విలాసవంతమైన సదుపాయాలతో ది సరయు ప్రాజెక్ట్‌ను చేపట్టింది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా గ్రూప్. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా సరయు నది ఒడ్డున ఓ హోటల్ కూడా ఉంటుంది. అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22నే ది సరయు ప్రాజెక్ట్‌ను లాంఛ్ చేయాలని భావిస్తోంది ఆ సంస్థ.
అయోధ్యలో అధునాతన ప్యాలెస్ హోటల్ నిర్మించేందుకు 'ది లీలా ప్యాలెసెస్, హోటల్స్ అండ్ రిసార్ట్స్' సంస్థతో ఇప్పటికే అవగాహన ఒప్పందం- ఎంఓయూ కుదుర్చుకుంది అభినందన్ లోధా గ్రూప్. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ల అభివృద్ధి కోసం రూ.3వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నట్లు గతేడాది జనవరిలో ఆ సంస్థ ప్రకటించింది. ఇందులో రూ.వెయ్యి కోట్లు అయోధ్యకే కేటాయించినట్లు తెలిపింది. లోధా వెంచర్స్ నేతృత్వంలోని అభినందన్ లోధా గ్రూప్ అయోధ్య, వారణాసి, గోరఖ్పుర్లోనూ హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టనుంది.
అయోధ్యలో రియల్ భూమ్
అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠకు సిద్ధమవుతున్న వేళ ఆ నగరంలో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. రామనగరితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు, రహదారులకు దగ్గర్లో నివాస, వాణిజ్య స్థలాలను కొనేందుకు పోటీపడుతున్నారు. ఇతర నగరాలకు చెందిన వారు కూడా అయోధ్యలో నివసించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఫలితంగా రిజిస్ట్రేషన్లు పెరిగి ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ ఖజానాకు భారీ స్థాయిలో ఆదాయం వస్తోంది. ఆ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాల ప్రకారం భూమి రిజిస్ట్రేషన్లు దాదాపు ఒకటిన్నర రెట్లు పెరిగాయి. పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
అయోధ్య రామాలయ గర్భగుడిలో ఇద్దరు బాల రాముళ్లు- కొత్త విగ్రహం తయారు చేసింది ఆయనే!
రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు 55 దేశాల అతిథులు- అక్కడి నుంచే మోదీ ప్రసంగం