వైద్య విద్యను హిందీలో బోధించేందుకు.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు MBBS పాఠ్య పుస్తకాలను హిందీలో ప్రచురించగా.. అమిత్ షా వాటిని భోపాల్‌లో విడుదల చేశారు. MBBSలో మూడు సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలను విడుదల చేశారు. చరిత్రలో ఇది చాలా ముఖ్యమైన రోజుగా అభివర్ణించారు అమిత్ షా. వైద్య విద్యను హిందీలో బోధిస్తున్న తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచిందని కొనియాడారు. అలాగే.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో రాజమాతా విజయరాజే సింధియా ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌కు శంకుస్థాపన చేశారు.
"ఆంగ్లం రావడం లేదనే ఆత్మన్యూనతా భావం అవసరం లేదు. సగర్వంగా తమ మాతృభాషల్లో ఉన్నత విద్యనభ్యసించవచ్చు. మెడికల్, ఇంజినీరింగ్ కోర్సులను హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, గుజరాతీ, బెంగాలీ సహా ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తేవాలని మోదీ సూచించారు. జాతీయ విద్యావిధానంలో భాగంగానే.. ఈ కార్యక్రమం మొదలైంది" అని అమిత్ షా పేర్కొన్నారు.
స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో రాజమాతా విజయరాజే సింధియా విమానాశ్రయ టెర్మినల్‌కు శంకుస్థాపన చేశారు. దాదాపు రూ. 500 కోట్ల వ్యయంతో కొత్త టెర్మినల్ని నిర్మించనున్నారు. ఈ విమానాశ్రయం మొత్తం సౌరశక్తి తోనే పనిచేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, జ్యోతిరాదిత్య సింధియా సహా పలువురు మంత్రులు పాల్గొన్నారు.