Ambulance Driver Son Theft : మహారాష్ట్రలోని నాగపుర్‌లో ఓ అంబులెన్స్ డ్రైవర్‌తోపాటు అతడి కుమారుడు చేసిన పనికి పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. అనారోగ్యంతో మృతిచెందిన ఓ వ్యక్తి మృతదేహాన్ని అంబులెన్స్‌లో అతడి స్వగ్రామానికి తరలించే క్రమంలో.. డ్రైవర్ కుమారుడు మృతుడి ఇంట్లో చోరీ చేశాడు. లక్షల విలువైన బంగారు ఆభరణాలతోపాటు నగదును దోచుకెళ్లాడు. అంత్యక్రియలు పూర్తైన తర్వాత.. మృతుడి భార్య ఇంటికొచ్చి చూడగా అసలు విషయం బయటపడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జిల్లాలోని సకర్దార పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసిస్తున్న కల్పనా ఘోడో భర్త.. గత నెల 20వ తేదీన అనారోగ్యంతో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే మృతుడి స్వగ్రామం మధ్యప్రదేశ్‌లోని బైతుల్ కావడం వల్ల అతడి మృతదేహం అక్కడికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో కల్పన భర్త మృతదేహాన్ని.. అంబులెన్స్‌లో తీసుకుని బయలుదేరారు. ఇంటి పెద్ద దిక్కు చనిపోవడం వల్ల కల్పన.. తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
అయితే ఘోడే కుటుంబసభ్యులంతా బైతుల్కు బయలుదేరడం వల్ల అంబులెన్స్ డ్రైవర్ పథకం వేశాడు. మృతుడి ఇంట్లో దొంగతనం చేయాలని తన కుమారుడికి తెలిపాడు. దీంతో డ్రైవర్ కుమారుడు.. బాధితుడి ఇంట్లో మొబైల్, నగదుతోపాటు లక్షల విలువైన బంగారు అభరణాలను దోచుకెళ్లాడు. భర్త అంత్యక్రియలు పూర్తయ్యాక కల్పన తిరిగి తన ఇంటికి ఇటీవలే చేరుకుంది. తీరా ఇంటి లోపలకు వెళ్లగా సామాన్లు, వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలో చూడగా నగదు, ఆభరణాలు కనిపంచలేదు. దొంగతనం జరిగిందని గ్రహించి.. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఘటనపై ఫిర్యాదు చేసింది.
కల్పన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె ఇంటికి వచ్చి పరిశీలించారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను తనిఖీ చేశారు. ముగ్గురు యువకులు.. బైక్‌పై వచ్చి చోరీ చేసినట్లు తేలింది. వెంటనే వారి అదుపులో తీసుకుని విచారించారు. ఈ నేపథ్యం వారి వివరణ ఆధారంగా సక్కర్‌దారా పోలీసులు.. వెంటనే ఇమామ్‌వాడా ప్రాంతానికి చెందిన నితేశ్ వాంఖడేను అరెస్టు చేశారు. అప్పుడు అతడు జరిగిన మొత్తాన్ని పోలీసులకు తెలియజేశాడు.