రాజస్థాన్ కోటా జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. కొవిడ్ మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్సు డ్రైవర్ అధిక డబ్బులు డిమాండ్ చేయగా.. కారులోనే మృతదేహాన్ని తరలించింది ఓ కుటుంబం.
ఏం జరిగింది?
రాజస్థాన్‌లోని ఝాలావాడ్కు చెందిన సీమ అనే మహిళకు కరోనా సోకగా.. కోటా వైద్య కళాశాలలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అయితే.. బాధితురాలి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని కోటా నుంచి ఝాలావాడ్కు తరలించేందుకు ఓ అంబులెన్సు డైవర్‌ను సంప్రదించారు. అందుకు అతడు రూ.35,000 డిమాండ్ చేశాడు. ఆ ధర విని కంగుతిన్నారా కుటుంబ సభ్యులు.
చాలాసేపు బేరాలు సాగించిన తర్వాత రూ.18,000కు అంబులెన్సు డ్రైవర్ అంగీకరించాడు. కానీ, తాము రూ.5,000 మాత్రమే చెల్లించగలుగుతామని సీమ కుటుంబ సభ్యులు చెప్పగా డ్రైవర్ ఒప్పుకోలేదు. ఇక గత్యంతరం లేక తమ కారులోనే మృతదేహానికి సీటుబెల్టు కట్టి ఇంటికి తీసుకువెళ్లారు.
విషయం తెలుసుకున్న అధికారులు చర్యలు చేపట్టారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని కోటా కలెక్టర్ ఉజ్వల్ రాఠోడ్ తెలిపారు.
ఇదీ చూడండి: కొత్తగా 2.08 లక్షల కేసులు.. 4,157 మరణాలు
ఇదీ చూడండి: అమేఠీకి రాహుల్ ఆక్సిజన్ సాయం