రాజస్థాన్‌కు చెందిన వంశికా శర్మ అనే యువతి.. అంకెలతో ఆటాడుకుంటోంది. కంప్యూటర్ కంటే వేగంగా గణిత ప్రక్రియలను చేసేస్తోంది. 11 అంకెల టేబుల్‌ను 39 సెకన్లలోనే చెప్పేసి ప్రపంచ రికార్డు కొట్టేసింది. అంతటితో ఆగని వంశిక తన అరుదైన ప్రతిభాపాటవాలను కనబరుస్తూ.. మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 20 అడుగుల పొడవైన పేపర్‌పై 280 అంకెల టేబుల్ రాసి రికార్డు సృష్టించింది. ఈ విధంగా ఆమె ఇప్పటి వరకు ఎనిమిది రికార్డులను కైవసం చేసుకుంది.
రెండు నుంచి ఇన్ఫినిటీ వరకు మ్యాథ్స్ టేబుల్స్‌ను వంశిక.. ఒకేసారి రెండు చేతులతో రాయగలదు. సీఎం అశోక్ గహ్లోత్, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సహా పలువురు రాజకీయనాయకులు ఆమె ప్రతిభను మెచ్చుకున్నారు. భారత్ పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ యువరాజు సైతం వంశిక నైపుణ్యానికి మంత్రముగ్ధులై ఆమెను ప్రశంసించారు.
"నేను సాధించిన రికార్డ్స్ అన్నీ మ్యాథమెటిక్స్‌కు సంబంధించినవే. రెండు నుంచి ఇన్ఫినిటీ వరకు మ్యాథ్స్ టేబుల్స్‌ను రాయగలను. ఈ టేబుల్స్‌ను తిరగేసి కూడా రాయగలను. నా బ్రెయిన్ రెండు భాగాలు యాక్టివ్‌గా పనిచేస్తున్నాయి. నేను రెండు చేతులతో రాయగలను. ఏవైనా రెండు మ్యాథ్స్ క్యాల్క్యులేషన్స్ ఒకేసారి రెండు చేతులతో రాయగలను. నేను నా మొదటి ప్రపంచ రికార్డును 2018 ఏప్రిల్ 14న సంపాదించాను. 11 అంకెల టేబుల్‌ను రాసేందుకు నాకు ఒక నిమిషం టార్గెట్ టైమ్ ఇస్తే నేను 39 సెకన్లలో పూర్తి చేశాను. ప్రతి సంవత్సరం నేను రెండు మూడు రికార్డులను సృష్టిస్తాను. ప్రతి ఏటా ఒక రికార్డునైనా కైవసం చేసుకోవాలని నేను టార్గెట్‌గా పెట్టుకున్నాను."
-వంశికా శర్మ, విద్యార్ధిణి
ప్రస్తుతం వంశిక ఇంటర్మీడియట్ చదువుతూ ఐఐటీ కోచింగ్ తీసుకుంటోంది. ఈ గణిత మేధావి.. మ్యాథ్స్‌కు సంబంధించిన పుస్తకాలు సైతం రాస్తోంది. ఇప్పటివరకు 16 పుస్తకాలు రాసింది. అవి ప్రచురణ కావాల్సి ఉంది.