సాధించాలనే దృఢ సంకల్పం ఉండాలే గానీ దేన్నైనా సాధించవచ్చని నిరూపించారీ సోదర, సోదరీమణులు. ఎంతటి సమస్యల్లో చిక్కుకున్నా.. వాటిని ఎలా అధిగమించవచ్చో నిరూపించారు. వైకల్యం శరీరానికి మాత్రమేనని, మనసుకు కాదని.. తమ అద్భుత కళా నైపుణ్యంతో చాటి చెబుతూ ఎందిరికో ప్రేరణగా నిలుస్తున్నారు.
సాధించారిలా..
కర్ణాటక ఉడుపి జిల్లాకు చెందిన గణేశ్, సుమంగళ పుట్టుకతోనే దివ్యాంగులు. బక్కపలుచని శరీరం, మరుగుజ్జుతనంతో.. నిలబడలేని స్థితి వారిది. బలవంతంగా కదిలితే.. ఎముకలు విరిగే ఓ వింత వ్యాధి వారిని పీడిస్తోంది. అయితే.. వీటన్నింటినీ అధిగమించి తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నారు. తమ అభిరుచికి అపారమైన ప్రతిభను జోడించి అద్భుతమైన కళాకారులుగా మారారు. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన గణేశ్.. సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా చిత్రలేఖనం నేర్చుకొని.. అనేక మంది ప్రముఖుల చిత్రాలను గీశాడు. అతడి సోదరి సుమంగళ కూడా నేర్పుగా బొమ్మల తయారీని నేర్చుకొని.. తన హస్తకళా నైపుణ్యంతో అందమైన ప్రతిమలను రూపొందిస్తూ ఔరా అనిపిస్తోంది.
అందరు మెచ్చిన కళ!
వీరి కళా నైపుణ్యాన్ని యోగాలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన తనుశ్రీ పిట్రోడి తల్లిదండ్రులు ప్రదర్శించారు. ఇందుకోసం స్ఫూర్తి-2020లో ఇటీవల ఓ ఎగ్జిబిషన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సందర్శించేందుకు వచ్చిన వారెందరో గణేశ్, సుమంగళ ప్రతిభను మెచ్చుకోవడం సహా.. వారు తయారుచేసిన వస్తువులను ఎంతో ఇష్టంతో కొనుగోలు చేశారు.
ఇదీ చదవండి: భూలోక స్వర్గాన్ని తలపించే అద్దాల మేడ