Amarnath yatra 2022: అమర్‌నాథ్ యాత్రలో ప్రమాదం జరిగింది. యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు జమ్ముకశ్మీర్ ఖ్వాజీగుండ్ వద్ద ప్రమాదానికి గురైంది. వేగంగా వచ్చిన బస్సు.. అప్పుడే రోడ్డు దాటుతున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది యాత్రికులు గాయపడ్డారు. వీరందరినీ అనంతనాగ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అందరూ క్షేమంగానే ఉన్నారు. మొత్తం 40 మంది యాత్రికులతో బస్సు.. బల్తాల్ బేస్ క్యాంప్వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
మరోవైపు ఎడతెరపిలేని వర్షాలతో అమర్‌నాథ్ యాత్రకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం, బల్తాల్ మార్గాల్లో భక్తులు వెళ్లేందుకు అక్కడి సిబ్బంది అనుమతించడం లేదు. వర్షాలు తగ్గేవరకు యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాలని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) అధికారులు సమాచారం ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.
ఈ విషయమై ఐటీబీపీ వర్గాలు స్పందిస్తూ "యాత్రను కొంతకాలం నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాం. పహల్గాం, బల్తాల్ మార్గాల ద్వారా వెళ్లే యాత్రికులను నిలిపివేశాం. వర్షం తగ్గాక పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటాం" అని తెలిపారు. అధిక వర్షాల కారణంగా జులై 5, జులై 8న ఇప్పటికే రెండు సార్లు యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఇవీ చదవండి: క్లాస్ రూమ్‌లో గన్ ఫైరింగ్ ప్రాక్టీస్