పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీ నిర్వహించింది. ఉభయ సభల కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలను కోరింది. ఆరోగ్యకరమైన, అర్థవంతమైన చర్చలకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని ప్రధాని మోదీ.. అఖిలపక్షానికి స్పష్టం చేసినట్లు భేటీ అనంతరం మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.
మోదీతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాజ్యసభలో అధికారపక్ష నేత పీయూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషి హాజరయ్యారు. కాంగ్రెస్ తరపున రాజ్యసభ నేత మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి పాల్గొన్నారు.
ఇతర రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు సైతం అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. డెరెక్ ఒబ్రెయిన్(టీఎంసీ), తిరుచి శివ(డీఎంకే), రామ్‌గోపాల్ యాదవ్(సమాజ్‌వాదీ), సతీశ్ మిశ్ర(బీఎస్పీ) సహా ఎన్డీఏ మిత్రపక్ష పార్టీల నేతలైన అనుప్రియా పటేల్(అప్నాదళ్), పశుపతి పరాస్(ఎల్జేపీ) సమావేశంలో పాల్గొన్నారు.
సోమవారం ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. సంప్రదాయం ప్రకారం కేబినెట్లో జరిగిన మార్పుల వివరాలను సమావేశం తొలిరోజున.. పార్లమెంట్ సభ్యులకు ప్రధానమంత్రి తెలియజేస్తారు.
కాంగ్రెస్ పార్లమెంటరీ సమావేశం
మరోవైపు, కాంగ్రెస్ పార్లమెంటరీ సమావేశం నిర్వహించిన ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ.. లోక్‌సభ, రాజ్యసభలోని తమ ఎంపీలతో బృందాలను ఏర్పాటు చేశారు. ఉభయ సభల్లో పార్టీ వైఖరిని స్పష్టంగా తెలియజేసేలా ఈ బృందాలను రూపొందించారు.
ఈ మేరకు కాంగ్రెస్ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. లోక్‌సభలో అధిర్ రంజన్ చౌదరి పార్టీ ఎంపీలకు నేతృత్వం వహించనున్నారు. గౌరవ్ గొగొయి ఉపనేతగా వ్యవహరించనున్నారు. చీఫ్ విప్‌గా కే సురేశ్ ఉండనున్నారు. వీరితో పాటు లోక్‌సభ బృందంలో శశిథరూర్, మనీశ్ తివారీ, రవ్నీత్ సింగ్ బిట్టూ, మాణికం ఠాకూర్ ఉన్నారు.
రాజ్యసభలో కాంగ్రెస్ పక్షనేతగా మల్లికార్జున ఖర్గే, ఉపనేతగా ఆనంద్ శర్మ వ్యవహరించనున్నారు. ఈ బృందంలో జైరాం రమేశ్, అంబికా సోని, పి. చిదంబరం, దిగ్విజయ్ సింగ్, కేసీ వేణుగోపాల్ ఉన్నారు.
లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేతగా అధిర్ రంజన్‌ను తప్పించి, మరొకరికి ఆ బాధ్యతలు అప్పగిస్తారని ఊహాగానాలు వచ్చినప్పటికీ... తాజా ప్రకటనతో అలాంటిదేమీ లేదని స్పష్టమైంది.
ఇదీ చదవండి: సహకారానికి సంస్కరణల చికిత్స