Alam Baig Skull Reach India : 166 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఓ భారత వీరుడి పుర్రె దేశానికి చేరింది. బ్రిటిష్ ఇండియా సైన్యంలో హవల్దారుగా పనిచేసిన భారత వీరుడు ఆలం బేగ్ పుర్రెను గత వారం లండన్ నుంచి స్వదేశానికి తీసుకొచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌కు చెందిన ఆలం బేగ్ 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నారు. ఈయన 46వ బంగాల్ రెజిమెంటులో పదాతిదళ సైనికుడిగా పనిచేసేవారు. బ్రిటీష్ ప్రభుత్వంపై తిరుగుబాటులో చురుగ్గా పాల్గొన్న కారణంగా ఆలం బేగ్‌ను దారుణంగా హత్య చేసి.. అతడి పుర్రెను బ్రిటిష్ రాణికి కానుకగా లండన్‌కు పంపారు.
![alam beg skull reached india](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-08-2023/thumbnailregardingconstableheadstory_05082023110430_0508f_1691213670_832.jpg)
అయితే, లండన్‌లోని ఓ పబ్ స్టోర్‌రూంలో పడి ఉన్న ఆలం బేగ్ పుర్రెను భారత్‌కు తీసుకురావడానికి చండీగఢ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జె.ఎస్.సహరావత్ నిరంతర ప్రయత్నాలు చేసి భారత్‌కు తెప్పించారు. ప్రస్తుతం పంజాబ్ పోలీసులకు అప్పగించిన ఈ పుర్రెను దిల్లీలో ఉంటున్న ఆలం బేగ్ వారసులకు అందజేయనున్నారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్ చౌబే సైతం పుర్రెను అధ్యయనం చేస్తారు. 2014 మార్చిలో పంజాబ్‌లోని అజ్‌నాలా బావిలో దొరికిన 200 పుర్రెలపై అధ్యయనం చేసిన అనుభవం ఈయనకు ఉంది.
![alam beg skull reached india](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-08-2023/thumbnailregardingconstablealambeghead_05082023111107_0508f_1691214067_62.jpg)
పబ్‌లో ఆలం బేగ్ పుర్రె
కాగా.. 1963లో ఆలం బేగ్ పుర్రెను, దానితోపాటు ఉన్న ఓ లేఖను అక్కడి పబ్‌లో గుర్తించింది లండన్‌కు చెందిన ఓ జంట. ఆ లేఖలో ఆలం బేగ్‌కు సంబంధించిన వివరాలన్నీ రాసి ఉన్నాయి. భారతదేశ చరిత్రపై పలు పరిశోధన గ్రంథాలు రాసిన లండన్ చరిత్రకారుడు ప్రొఫెసర్ ఎ.కె.వాగ్నర్.. అది ఆలం బేగ్ పుర్రేనంటూ నిర్ధరించారు. దీంతో ప్రొఫెసర్ సహరావత్ ఇటు కేంద్ర ప్రభుత్వానికి, అటు బ్రిటిష్ సర్కారుకు అనేక లేఖలు రాశారు. ప్రొఫెసర్ ఎ.కె.వాగ్నర్‌ను కూడా సంప్రదించడం వల్ల ఆయన ఆ పుర్రెను సహరావత్‌కు అందజేశారు. ఆలం బేగ్ వారసుల నుంచి పుర్రెను తిరిగి స్వాధీనం చేసుకున్నాక దానిపై అధ్యయనం చేస్తామని.. తర్వాత సంప్రదాయ పద్ధతుల్లో అంత్యక్రియలు జరుపుతామని ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్ చౌబే 'ఈటీవీ భారత్'కు చెప్పారు.
ఇవీ చదవండి : అందాల రాశి.. అరివీర పోరు.. బ్రిటిష్ తుపాకులకు ఎదురొడ్డి వీరత్యాగం..
తెల్లవారిని తెల్లబోయేలా చేసిన 'పైకాలు'.. 1817లోనే సైనిక తిరుగుబాటు!