AICTE Scholarships 2023 : ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(AICTE) ప్రతి సంవత్సరమూ.. పేద, దివ్యాంగ విద్యార్థినులకు రెండు రకాల స్కాలర్షిప్లు అందిస్తున్న విషయం తెలిసిందే. 2023-24 విద్యాసంవత్సరానికిగానూ.. ఆ స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన నోటిఫికేషన్ను ఏఐసీటీఈ(AICTE) విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఉపకార వేతనాల కోసం అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు తుది గడువు 2023, డిసెంబర్ 31గా ప్రకటించారు. ఇంతకీ ఆ స్కాలర్షిప్స్ ఏంటి? అర్హతలేమిటి? ఎలా అప్లై చేసుకోవాలి? వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
AICTE Pragati Scholarship 2023 :
AICTE ప్రగతి స్కాలర్‌షిప్ 2023 : ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(AICTE) మహిళలను టెక్నికల్ ఎడ్యుకేషన్లో ప్రోత్సహించేందుకు.. ప్రగతి స్కాలర్‌షిప్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల బాలికలకు ప్రతి సంవత్సరం ఈ స్కీమ్ కింద ఏఐసీటీఈ ఉపకారం వేతనం అందిస్తోంది. టెక్నికల్ డిగ్రీ లేదా డిప్లోమా కోర్సులు చదువుతున్న అర్హులైన అమ్మాయిలకు దీని కింద ఆర్థికసాయం అందిస్తారు. ఒక కుటుంబం నుంచి ఇద్దరు అమ్మాయిలు ఈ ఉపకార వేతనాలకు అర్హులు. సరైన అర్హతలున్న వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి.
అర్హతలు : డిగ్రీ వారు ఏదైనా టెక్నికల్ డిగ్రీ కోర్సు అభ్యసిస్తూ ఉండాలి. డిప్లొమా వారు ఏదైనా టెక్నికల్ డిప్లొమా లెవల్ కోర్సు చదువుతూ ఉండాలి. లేదా లేటరల్ ఎంట్రీ ద్వారా రెండో సంవత్సరం ప్రవేశాలు పొందిన డిగ్రీ, డిప్లొమా అభ్యర్థులు కూడా అర్హులే. అలాగే వారి కుటుంబ వార్షికాదాయం రూ. 8 లక్షలకు మించకూడదు.
స్కాలర్‌షిప్ మొత్తం : టెక్నికల్ డిప్లొమా రెగ్యులర్ విద్యార్థులకు మూడు సంవత్సరాలు, లేటరల్ ఎంట్రీ అభ్యర్థులకు రెండు సంవత్సరాల వరకు.. ప్రతీ ఏటా రూ.50వేల చొప్పున అందిస్తారు. అలాగే.. టెక్నికల్ డిగ్రీ కోర్సు చదివే రెగ్యులర్ విద్యార్థులకు నాలుగేళ్లపాటు, లేటరల్ ఎంట్రీ అభ్యర్థులకు మూడేళ్లపాటు రూ.50వేల చొప్పున ఇస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ : డిసెంబర్ 31, 2023
ఎంపిక విధానం : అర్హులైన వారి నుంచి అకడమిక్ మెరిట్ ఆధారంగా స్కాలర్‌షిప్ అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
How to Check TS ePASS Scholarship Status : మీ స్కాలర్‌షిప్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!
AICTE Saksham Scholarship 2023 :
AICTE సక్షం స్కాలర్‌షిప్ 2023 : ఈ స్కాలర్‌షిప్ ప్రత్యేకించి దివ్యాంగ అభ్యర్థుల కోసం. టెక్నికల్ విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా కోర్సులో మొదటి సంవత్సరంలో అడ్మిషన్ తీసుకునే విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. లేటరల్ ఎంట్రీ ద్వారా రెండో సంవత్సరం ప్రవేశాలు పొందిన డిగ్రీ, డిప్లొమా దివ్యాంగ అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ పథకం కింద ఎంపికైన అభ్యర్థులకు ఏటా రూ.50 వేలు అందజేస్తారు. ఇక్కడ కూడా కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8 లక్షల లోపు ఉండాలి. అలాగే దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వైకల్యం 40 శాతానికి తగ్గకుండా ఉండటం కూడా ముఖ్యం.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 31 డిసెంబర్, 2023.
మీరు ఈ స్కాలర్‌షిప్‌లకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి, దరఖాస్తు చేయడానికి aicte-india.org అనే వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
విద్యార్థులకు శుభవార్త.. ఉపకార వేతనాలకు కుటుంబ వార్షికాదాయం పెంపు
ఈ అమ్మాయిలు అమెరికాలో అడ్మిషన్ మాత్రమే కాదు.. రూ. కోట్ల స్కాలర్ షిప్.. సాధించారు!