పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) అధ్యక్షునిగా క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను నియమిస్తున్నట్టు ఆదివారం పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. వివిధ వర్గాలకు ప్రాధాన్యం ఉండేలా నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమించింది. కుల్జీత్ నగ్రా, పవన్ గోయల్, సుఖ్వీందర్ సింగ్ డానీ, సంగత్ సింగ్ గల్జియాన్‌లకు ఈ పదవులు దక్కాయి. ఈ మేరకు పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
నగ్రా ఇంతవరకు సిక్కిం, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తుండగా, ఇకపై ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు సునీల్ జాఖడే సేవలను గుర్తించిన పార్టీ ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ వర్గం తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ సిద్ధూవైపే నాయకత్వం మొగ్గు చూపడం విశేషం. కెప్టెన్-సిద్ధూల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
పంజాబ్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి అశ్వినీ కుమార్ దీనిపై స్పందిస్తూ అధిష్ఠానం నిర్ణయాన్ని అందరూ ఆమోదించాలని కోరారు. "ఇది అందరూ ఏకం కావాల్సిన సమయం. ఎవరూ విజేతలు కారు. పరాజితులూ లేరు. సర్దుబాటు చేసుకుంటూ సాగాలి. సంక్లిష్టమైన రాజకీయ సమస్యలు తలెత్తినప్పుడు స్పష్టమైన పరిష్కారాలు లభించడం సాధ్యం కాదు. రాజకీయాల్లో వ్యక్తులు ఎంత ముఖ్యమో, లక్ష్యాలూ అంతే ప్రధానమైనవి" అని అన్నారు.
గొడవలు ఎందుకు?
సుదీర్ఘ క్రికెట్ అనుభవంతో సిక్సర్ల సిద్ధూగా పేరొందిన ఈయన 2004 నుంచి 2014 వరకు అమృత్‌సర్ లోక్‌సభ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించారు. 2014లో ఆ స్థానాన్ని దివంగత నేత అరుణ్‌జైట్లీకి కేటాయించడం కోసం సిట్టింగ్ ఎంపీ అయిన సిద్ధూకు టికెట్ నిరాకరించారు. ఆ తర్వాత 2016లో భాజపా తరఫున రాజ్యసభకు పంపారు. అయితే 2017లో పంజాబ్ ఎన్నికల ముందు ఆయన భాజపాకు, రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ తరఫున అమృత్‌సర్ తూర్పు నుంచి అసెంబ్లీకి ఎన్నికై 2017 నుంచి 2019 వరకు అమరీందర్ సింగ్ మంత్రివర్గంలో స్థానిక ప్రభుత్వం, పర్యాటకం, సాంస్కృతికశాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ముఖ్యమంత్రితో పొసగక ఆయన 2019 జులై 15న మంత్రిపదవికి రాజీనామా చేశారు.
సిద్ధూ పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లడంతోపాటు, అక్కడ ఆ దేశ సైన్యాధ్యక్షుడిని కౌగిలించుకోవడం భారత్‌లో పెద్ద దుమారం రేపింది. ఆ తర్వాత 2019 సాధారణ ఎన్నికల్లో తన భార్యకు ఎంపీ టికెట్ రాకుండా చేయడంలో అమరీందర్ ప్రోద్బలం ఉందని ఆయనతోపాటు, సతీమణి కూడా బహిరంగంగా ఆరోపించారు. దాంతో ఇద్దరి మధ్య అగాధం పెరిగిపోయింది. అప్పటి నుంచి అది రాజుకుంటూనే వచ్చింది. ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత మంత్రివర్గం నుంచి సిద్ధూను తొలగించడంతో పంజాబ్ కాంగ్రెస్ రాజకీయాలు ఉప్పు, నిప్పులా మారిపోయాయి.
విధిలేకే!
పాటియాలా రాజవంశానికి చెందిన అమరీందర్ తొలి నుంచీ పంజాబ్ కాంగ్రెస్‌పై పూర్తి పట్టు సాధించారు. తాను చెప్పిందే అధిష్ఠానం వినాలనేది ఆయన భావన. రాష్ట్ర కాంగ్రెస్‌పై ఆయనకున్న పట్టుకారణంగానే అధిష్ఠానం విధిలేక కొనసాగించాల్సి వస్తోందన్న వాదన ఉంది. 2017 ఎన్నికల్లో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో రాహుల్‌గాంధీ నవజ్యోత్‌సింగ్ సిద్ధూను పార్టీలోకి తీసుకొచ్చారు. అయితే అమరీందర్ తన రాజకీయ చాతుర్యంతో ఆయన్ను వెనక్కు నెట్టేశారు. ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు 2015లో రాహుల్‌గాంధీ అమరీందర్ వ్యతిరేకి అయిన ప్రతాప్‌సింగ్ బజ్వాను పీసీసీ అధ్యక్షుడిని చేశారు. అయినా ఒత్తిడి తెచ్చి ఆయన్ను మార్పించగలిగారు. అమరీందర్.. రాజీవ్‌గాంధీకి సన్నిహితుడు. డూన్ స్కూల్‌లో కలిసి చదువుకున్నారు. అలాంటి తనకు వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారన్న ఉద్దేశంతో తనకు పోటీ పెట్టిన వారందర్నీ ముప్పుతిప్పలు పెట్టారు. ఇందులో భాగంగానే సిద్ధూని మంత్రివర్గం నుంచి బయటకు పోయేలా చేశారు.
ఎన్నికల దృష్ట్యా
మరో ఆరునెలల్లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతుండటంతో పార్టీలో అంతర్గతకుమ్ములాటలు నిరోధించి, ఒక్కతాటిపై నడపడానికి ఇప్పుడు అధిష్ఠానం సిద్ధూని పీసీసీ అధ్యక్షుడిని చేసింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నోరున్నవారైతేనే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతారన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ఆయనవైపు మొగ్గుచూపింది. అమరీందర్‌సింగ్ 2017లో జరిగిన ఎన్నికల సమయంలోనే ఇవే తనకు చివరి ఎన్నికలన్న సానుభూతి కార్డు ప్రయోగించి అధికారంలోకి వచ్చారు. వచ్చే ఏడాది ఎన్నికలు ముగిసేనాటికల్లా ఆయనకు 80 ఏళ్లు వస్తాయి. వయోభారం మీదపడుతున్నప్పటికీ పార్టీని తనగుప్పిట్లో ఉంచుకొని ఎన్నికలను శాసించాలని ఆయన భావిస్తున్నారు.