తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు భాజపా ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. అన్నాడీఎంకేతో కలిసి బరిలోకి దిగుతున్న భాజపా ఓటర్లను ఆకర్షించేందుకు తన సొంత మేనిఫెస్టోను రూపొందించింది. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, వీకే సింగ్‌తో పాటు పలువురు భాజపా నేతలు చెన్నైలో మేనిఫెస్టోను విడుదల చేశారు. రైతులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు.
తాము అధికారంలోకి వస్తే యువతకు 50లక్షల ఉద్యోగాల కల్పనతో పాటు వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ రూపకల్పన చేస్తామని హామీ ఇచ్చారు. తమిళనాడులో అధికార అన్నాడీఎంకేతో కూటమిలో భాగంగా భాజపా 20 స్థానాల్లో పోటీచేస్తోంది.
శాసనమండలి పునరుద్ధరణ..
ముఖ్యంగా దశాబ్దాల క్రితం.. తన మిత్రపక్షం రద్దు చేసిన శాసన మండలిని పునరుద్ధరిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టం చేసింది భాజపా.
1986లో ఏఐఏడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్.. మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత అదే సంప్రదాయాన్ని కొనసాగించింది ద్రవిడ పార్టీ. అనంతరం.. డీఎంకే అధికారంలోకి వచ్చిన సమయంలో మండలిని పునరుద్ధరించాలని ప్రయత్నించినా సఫలం కాలేదు.
ముఖ్యమైన హామీలివే..
⦁ యువతకు కొత్తగా 50లక్షల ఉద్యోగావకాశాలు కల్పన
⦁ రైతులకు ఇస్తున్నట్టుగానే మత్స్యకారులకూ ఏటా రూ.6వేలు సాయం
⦁ 18 నుంచి 23 ఏళ్ల వయస్సు లోపు ఉన్న యువతులకు ఉచితంగా ద్విచక్రవాహన లైసెన్స్ జారీ
⦁ ఎనిమిది, తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు
⦁ ఇంటింటికీ రేషన్ పంపిణీ
⦁ సులభతరవాణిజ్యంలోదక్షిణ భారతదేశంలోనే తమిళనాడును నంబర్ 1గా నిలపడం
⦁ వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్
⦁ అన్ని జిల్లా కేంద్రాల్లో మల్టీ స్పెషాలటీ ఆస్పత్రుల నిర్మించి, ఉచితంగా వైద్యసేవలు
⦁ జల్‌జీవన్ మిషన్ కింద 2022 నాటికి ప్రతి ఇంటికీ పంపు ద్వారా ఉచితంగా స్వచ్ఛమైన తాగునీరు సరఫరా
⦁ దిల్లీ మాదిరిగానే చెన్నై కార్పొరేషన్‌ను మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించడం
ఇవీ చదవండి: ఆ రాష్ట్రంలో ఎన్నికలున్నా ఫ్లెక్సీలు లేవు.. ఎందుకంటే?