వ్యవసాయ చట్టాలపై కేంద్రం- రైతుల మధ్య ఎన్ని చర్చలు జరుగుతున్నా ఫలితం ఓ కొలిక్కి రావడం లేదు. అయితే తదుపరి చర్చలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇరు పక్షాలకు సానుకూల ఫలితం వస్తుందని ఆశిస్తున్నట్లు ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
నేను జ్యోతిష్కుడిని కాదు..
డిసెంబరు 30న జరిగిన చర్చలు స్నేహపూర్వక వాతావరణంలో జరిగాయని తోమర్ అన్నారు. జనవరి 4న జరిగే చర్చల్లో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నారు. చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు భీష్మించుకోవడంపై స్పందిస్తూ వేచి చూద్దామని వ్యాఖ్యానించారు.
"ఇప్పుడే ఏమీ చెప్పలేను. నేను జ్యోతిష్కుడిని కాదు. కానీ తదుపరి చర్చల్లో వచ్చే తుది నిర్ణయం ఏదైనా అది దేశానికి, రైతులకు మేలు చేస్తుందని ఆశిస్తున్నాను."
-నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి
2020 సెప్టెంబరులో ప్రవేశపెట్టిన సాగు చట్టాలపై.. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటివరకూ రైతులతో కేంద్రం ఆరుసార్లు చర్చలు జరిగినా అసంపూర్తిగానే ముగిశాయి. రైతుల ప్రధాన డిమాండ్లు- మూడు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరపై ఎలాంటి ప్రకటనా రాలేదు. దీంతో జనవరి 4న జరిగే చర్చలు ఇరు పక్షాలకు కీలకంగా మారాయి. తదుపరి చర్చలు విఫలమైతే ఆందోళనలు మరింత తీవ్రం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి : 'కేంద్రం వెంటనే దిగొచ్చి... సాగు చట్టాలు రద్దు చేయాలి'