Agastya Rover Designed by Students in Surat : గ్రహాల ఉపరితలాన్ని పరిశోధించడానికి ఉపయోగపడే రోవర్‌ను తయారు చేశారు గుజరాత్‌కు చెందిన విద్యార్థులు. అతి తక్కువ ఖర్చుతో రోవర్‌ను రూపొందించి ఔరా అనిపించారు. సూరత్‌లోని సర్దార్ వల్లభ్‌బాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన బీటెక్ విద్యార్థులు.. 'అగస్త్య' అనే పేరుతో దీన్ని తయారు చేశారు. ఈ రోవర్‌ను అన్ని బ్రాంచ్‌లకు చెందిన 25 మంది విద్యార్థులు కలిసి నాలుగు నెలల్లోనే ఆధునిక సాంకేతికతతో అగస్త్యను రూపొందించారు. సాధారణంగా రోవర్ తయారీకి ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని, తాము మాత్రం కేవలం లక్షన్నర వెచ్చించి అగస్త్యను తయారు చేశామని బీటెక్ విద్యార్థులు చెప్పారు.
ఆధునిక టెక్నాలజీతో 'అగస్త్య' తయారీ
'అగత్స్య' రోవర్‌ను ఆధునిక టెక్నాలజీతో రూపొందించారు. ఇందులో మొబైల్ లాబొరేటరీ, మానిప్యులేటర్, జీపీఎస్ మాడ్యూల్, స్కాన్ మాడ్యూల్, కొలేషన్ సిస్టమ్, లైడార్ టెక్నాలజీ వంటి అత్యంత ఆధునిక సాంకేతికలను వినియోగించారు. మిగతా రోవర్లానే 'అగస్త్య' గ్రహ ఉపరితలంపై తిరగడం, నమూనాలను సేకరించడం, డేటాను పంపించటం వంటి పనులు చేయగలదు. గ్రహం ఉపరితల మట్టిని సేకరించి నైట్రోజన్, కార్బన్డయాక్సైడ్, మీథేన్ మొదలైన మూలకాల ఉనికిని గుర్తించగలదు 'అగస్త్య'. ఈ రోవర్ దాదాపు మూడు నుంచి నాలుగు కిలోల బరువులను ఎత్తగలదని విద్యార్థులు చెబుతున్నారు.
"స్వయంచాలిత వ్యవస్థలో ఏదైనా సమస్య వస్తే వెంటనే ఆటోమెటిక్‌గా ఆఫ్ అవుతుంది. అలానే టెలీమోడ్లోకి వెళ్తుంది. దీంతో బేస్ స్టేషన్ నుంచి రోవర్‌ను ఆపరేట్ చేయవచ్చు. బేస్ స్టేషన్ దగ్గరకు తీసుకురావచ్చు. రోవర్ ప్రయాణించేటప్పుడు ఒక్కసారిగా ఏదైనా సమస్య వచ్చి ఆఫ్ అయితే తిరిగి బేస్ స్టేషన్‌కు వచ్చేలా కోఆర్డినేన్స్ ఇచ్చాం."
- అమన్, విద్యార్థి
అంతర్జాతీయ పోటీల్లో రోవర్ సత్తా!
ఇంటర్నేషనల్ రోవర్ ఛాలెంజ్ ఛాంపియన్షిప్ పోటీలో మొదటి రౌండ్‌ను విజయవంతంగా పూర్తి చేసింది అగస్త్య. వచ్చే ఏడాది కోయంబత్తూరులో జరిగే రెండో రౌండ్లో ఇతర దేశాల రోవర్లతో ఇది పోటీ పడనుంది.