బెంగళూరు వేదికగా ఏరో ఇండియా 2021 కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ నెల 5 వరకు కొనసాగనున్న ఎయిర్ షోను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రారంభించారు. యలహంకలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
కార్యక్రమంలో భాగంగా.. 83 'తేజస్' విమానాల కొనుగోలు కాంట్రాక్టును హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హాల్)కు లాంఛనంగా అప్పగించింది కేంద్రం. రూ. 48 వేల కోట్ల విలువైన ఈ ఒప్పందంపై.. రక్షణ శాఖ, హాల్ అధికారులు సంతకాలు చేశారు.
అద్భుత వేదిక
ఈ సందర్భంగా ట్వీట్ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రక్షణ, ఏరోస్పేస్ రంగంలో భారత్ అనేక అవకాశాలు అందిస్తోందని అన్నారు. ఈ రంగాల్లో భాగస్వామ్యం పెంపొందించుకోవడానికి ఏరో ఇండియా అద్భుతమైన వేదికగా నిలుస్తోందని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ఈ రంగాల్లో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చిందని చెప్పారు. దేశం ఆత్మనిర్భర్ భారత్‌గా మారేందుకు ఇవి దోహదం చేస్తాయని స్పష్టం చేశారు.