'లౌకికవాదానికి ఇదే అసలైన నిర్వచనం'-రామమందిర నిర్మాణంపై అడ్వాణీ - అయోధ్య రామ మందిరం
Advani Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిర నిర్మాణం కోసం ప్రారంభించిన రామజన్మభూమి ఉద్యమం గురించి బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే ఆడ్వాణీ కీలక విషయాలు పంచుకున్నారు. ఇటీవలే ఆయన రాసిన ఓ వ్యాసంలోని మరికొంత సమాచారాన్ని ఆడ్వాణీ కార్యాలయం శనివారం విడుదల చేసింది.
Published : Jan 14, 2024, 7:39 AM IST
Advani Ayodhya Ram Mandir : అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ప్రారంభించిన రామజన్మభూమి ఉద్యమం కుహనా లౌకికవాదుల దాడి నడుమ లౌకికవాదానికి అసలైన నిర్వచనం తిరిగి పొందేందుకు ఓ చిహ్నంగా నిలిచిందంటూ బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే ఆడ్వాణీ అభిప్రాయపడ్డారు. 'శ్రీరామ మందిరం : నెరవేరిన దివ్య కల' అనే పేరుతో ఆయన ఇటీవలే రాసిన ఓ వ్యాసంలోని దీనికి సంబంధించిన మరికొంత సమాచారాన్ని ఆడ్వాణీ కార్యాలయం శనివారం విడుదల చేసింది. ఈ ఉద్యమం సందర్భంగానే నికార్సైన లౌకికవాదం, కుహనా లౌకికవాదాల నడుమ తేడాలపై దేశమంతా ఓ ప్రత్యేకమైన చర్చ ప్రారంభమైందంటూ ఆయన పేర్కొన్నారు. ఈ చారిత్రక సందర్భాన్ని కళ్లారా చూడటం వల్ల తన జన్మ ధన్యమైందని, ఓ భారత పౌరుడిగా తాను గర్వపడుతున్నానంటూ ఆడ్వాణీ అన్నారు.
"1990లో రామమందిర నిర్మాణం కోసం మేము రథయాత్ర ప్రారంభించిన సమయంలో మాకు ప్రజల నుంచి పుష్కలంగా మద్దతు లభించింది. కానీ, ఆ సమయంలో చాలా రాజకీయ పార్టీలు మా వెంట నడిచేందుకు వెనుకడుగు వేశాయి. ముస్లిం ఓట్లు పోతాయని వారికి భయం. ఓటు బ్యాంకు రాజకీయాలకు లొంగిపోయిన వారు సెక్యులరిజం పేరుతో తమ వైఖరిని సమర్థించుకున్నారు. అయోధ్య భూవి వాదంపై కోర్టులో సుదీర్ఘ న్యాయ పోరాటం జరుగుతున్న సమయంలోనూ నాతోపాటు బీజేపీ, సంఘ్ పరివార్‌లోని ప్రతి సభ్యుడు రామ్ లల్లాను న్యాయమైన స్థానంలో ప్రతిష్ఠించాలనే కలను సాకారం చేసే దిశగాన భారతీయుల ఆత్మను మేల్కొలిపేందుకు మా వంతు కృషి చేస్తూ వచ్చాం. 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ నిర్ణయాత్మక తీర్పుతో ప్రశాంత వాతావరణంలో ఇప్పటి రామమందిర పునర్నిర్మాణం జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది"
--అడ్వాణీ
'ఆ ఇద్దరినీ మిస్సవుతున్నా'
రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న ఈ శుభ తరుణంలో ఆ ఇద్దరు వ్యక్తుల లోటు తనకు స్పష్టంగా కనిపిస్తోందని ఆడ్వాణీ అన్నారు. ఒకరు తన భార్య కమల కాగా, మరొకరు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అని చెప్పారు. 'వాజ్‌పేయీ నా రాజకీయ, వ్యక్తిగత జీవితంలో ఓ అంతర్భాగం. ఇక రెండో వ్యక్తి నా భార్య దివంగత కమల. ప్రజాజీవితంలో సుదీర్ఘమైన నా ప్రస్థానానికి ఆమె స్థిరత్వం, అసమాన బలాన్ని చేకూర్చింది' అని ఆడ్వాణీ ఆ ఇద్దరినీ గుర్తుచేసుకున్నారు.