Actress Jaya Prada ESI Case : కార్మికుల నుంచి ఈఎస్ఐ డబ్బులు తీసుకొని తిరిగి చెల్లించని కేసులో తనకు విధించిన శిక్షను ప్రముఖ నటి జయప్రద సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు జడ్జి జయచంద్రన్.. స్పందన తెలియజేయాలంటూ ఈఎస్ఐ కంపెనీని ఆదేశించారు. ఈ కేసులో తమిళనాడులోని ఎగ్మోర్ కోర్టు జయప్రదకు శిక్ష విధించింది. ఆగస్టు 10న ఈ తీర్పు వెలువరించింది. జయప్రదతో పాటు మరో ముగ్గురికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. దోషులకు ఎలాంటి బెయిల్ ఇవ్వకుండా రూ.5వేల జరిమానా విధించింది.
కేసు ఏంటంటే?
Jaya Prada Jail Madras High Court Case : చెన్నైలోని అన్నా రోడ్లో జయప్రద ఓ థియేటర్‌ను నడిపించారు. రామ్‌కుమార్, రాజ్‌బాబు అనే ఇద్దరితో కలిసి ఈ థియేటర్‌ను నిర్వహించేవారు. అయితే, థియేటర్లో పనిచేసే వర్కర్ల నుంచి ఈఎస్ఐ డబ్బులు వసూలు చేశారు. 1991 నుంచి 2002 మధ్య రూ.8.17 లక్షలు, 2002 నుంచి 2005 మధ్య రూ.లక్షా 58వేలు, 2003లో మరో రూ.లక్షా 58 వేలను నిందితులు సేకరించారు. కానీ, ఈ డబ్బును వారు కార్మికుల ఈఎస్ఐ ఖాతాల్లో జమా చేయలేదు.
దీంతో కార్మికులంతా బీమా సంస్థను ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి చెన్నై ఎగ్మోర్ కోర్టులో ఐదు కేసులు దాఖలయ్యాయి. ఈఎస్ఐ కంపెనీ తరఫున ఈ కేసులు నమోదయ్యాయి. విచారణ సందర్భంగా తమ వాదనలు వినిపించిన జయప్రద.. వర్కర్లకు ఇన్సూరెన్స్ డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పుకొచ్చారు. అయితే, డబ్బులు ఈఎస్ఐ ఖాతాలో జమా చేయకపోవడం వల్ల వర్కర్లు తీవ్రంగా ప్రభావితమయ్యారని ఈఎస్ఐ వాదించింది. డబ్బు తిరిగి చెల్లిస్తామనే జయప్రద ప్రతిపాదనను ఈఎస్ఐ తరఫు న్యాయవాది ఖండించారు.
ఇరువర్గాల వాదనలన్నీ విన్న న్యాయస్థానం ఆగస్టు 10న తీర్పు చెప్పింది. జయప్రదను దోషిగా తేల్చింది. మరో ఇద్దరిని సైతం దోషులుగా తేల్చుతూ శిక్ష విధించింది. ఎగ్మోర్ కోర్టు శిక్షను సవాల్ చేస్తూ మద్రాస్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు జయప్రద. దీనిపై ఈఎస్ఐ కంపెనీ స్పందన కోరిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయచంద్రన్.. తదుపరి విచారణను అక్టోబర్ 18కి వాయిదా వేశారు.