తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్నాడీఎంకే-భాజపా కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్డీఏ నుంచి విజయకాంత్ అధినాయకత్వంలోని దేశీయ ముర్పొక్కు ద్రవిడ కళగం(డీఎండీకే) పార్టీ తప్పుకుంది. తొలుత కలిసి పోటీ చేయాలని భావించినా... సీట్ల సర్దుబాటలో ఇరుపార్టీలు జరిపిన చర్చలు కొలిక్కి రాకపోవడం కారణంగా కూటమి నుంచి వైదొలిగినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
కూటమిలోని ప్రధాన మిత్రపక్షమైన పీఎంకేకు 23 సీట్లు, భాజపాకు 20 సీట్లు కేటాయించింది అన్నాడీఎంకే. అయితే... సీట్ల పంపకం విషయంలో విజయకాంత్‌తో ఏకాభిప్రాయానికి రాలేకపోయింది.
కమల్ స్నేహ హస్తం...
భాజపా-అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలిగిన కాసేపటికే.. మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ విజయకాంత్‌కు స్నేహహస్తం అందించారు. ఎన్నికల్లో తమతో కలిసి పోటీ చేయాలని కోరారు. ఇందుకు సంబంధించి విజయకాంత్‌తో చర్చలు జరిపే బాధ్యతను ఎంఎన్ఎం ఉపాధ్యక్షుడు పొన్నురాజ్కు అప్పగించారు.
2011 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌కాంత్ పార్టీ అన్నాడీఎంకేతో తొలిసారిగా పొత్తు పెట్టుకుంది. ఆ ఎన్నికల్లో 234 సీట్లకు గానూ వీరి కూటమి 203 సీట్లు కైవసం చేసుకుంది. అయితే... 29 సీట్లతో రెండో అతి పెద్ద పార్టీగా ఉన్నందున విజయకాంత్ ప్రధాన ప్రతిపక్షనేతగా వ్యవహరించారు. 2016 ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకేకు ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పాటు చేసి.. ఘోర పరాజయం చవిచూశారు. తదనంతరం మారిన రాజకీయ సమీకరణల్లో భాగంగా 2019లో ఎన్డీఏలో చేరిన డీఎండీకే... పరిస్థితి మొదటి నుంచి అగమ్యగోచరంగా ఉంది. ఇటు అన్నాడీఎంకే కూటమిలో ప్రాధాన్యం లేక, డీఎంకేతో కలవలేని స్థితికి చేరింది.
ఇదీ చూడండి: అన్నాడీఎంకే 'మౌనం'- ఏకాకిగా విజయకాంత్!