స్కూల్‌కు వెళ్తున్న ఓ యువతిపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడిన ఘటన దిల్లీలో జరిగింది. యువతి సోదరి కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నందున ఆమె హుటాహుటిన ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులకు జరిగిందంతా వివరించింది. దీంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.
అసలేం జరిగిందంటే..:
దిల్లీ ద్వారకా జిల్లాలోని ఉత్తమ్ నగర్లో ఉదయం సుమారు 7:30 సమయంలో స్కూల్‌కు వెళ్తున్న ఓ 17ఏళ్ల యువతిపై యాసిడ్ దాడికి పాల్పడ్డారు ఇద్దరు వ్యక్తులు. బైక్‌పై వచ్చిన ఆ నిందితులు అటుగా వెళ్తున్న ఆ యువతిపై అకస్మాత్తుగా యాసిడ్ పోసి పరారయ్యారు. ఘటనా స్థలిలో ఉన్న యువతి సోదరి భయపడుతూ ఇంటికి చేరుకుని విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది.
దీంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. యాసిడ్ ఆమె రెండు కళ్లలో పడిందని అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తనకు ఇద్దరిపై అనుమానం ఉందని తెలిపిన ఆ యువతి వారి పేర్లను పోలీసులకు తెలిపింది. సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు బాధితురాలు తెలిపిన వివరాల ఆధారంగా ఇద్దరు నిందితులు సహా వారికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బాలికపై యాసిడ్ పోసిన నిందితులకు కఠిన శిక్ష విధించాలని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. 'ఇలాంటి వాటిని ఏమాత్రం సహించకూడదు. నిందితులకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది. వారిని అసలు విడిచిపెట్టకూడదు. వీలైనంత కఠినంగా శిక్షించాలి. దిల్లీలోని ప్రతి బాలిక క్షేమం మా ప్రాధాన్యం' అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.