Achchennaidu Mulakat with Chandrababu : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు తిరగబడి కొట్టే పరిస్థితి వచ్చిందన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ వన్‌సైడ్‌గా గెలవబోతోందని, చంద్రబాబు సీఎం అవుతారని సర్వేలు చాటుతున్నాయని అన్నారు. రాజమహేంద్రవరంలో చంద్రబాబును కలిసిన అచ్చెన్న.. అనంతరం మీడియాతో మాట్లాడారు. టీడీపీలో ప్రతి నాయకుడు, కార్యకర్త.. చంద్రబాబే అని తెలిపారు. పోలీసులు అణచివేసినా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మద్దతు ఇస్తున్నారని అన్నారు. రాష్ట్ర పరిణామాలపై జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకే తమ నేత లోకేశ్ దిల్లీ వెళ్లారని వివరించారు. రాజమహేంద్రవరం జైలులో ఉన్న చంద్రబాబుతో సోమవారం సాయంత్రం అచ్చెన్న, భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, మాజీ మంత్రి పత్తిపాటి ములాఖత్ అయ్యారు.
చంద్రబాబు జైలులో ఉంటే వైసీపీ నేతలు శునకానందం పొందుతున్నారని, నూటికి లక్ష శాతం కక్షసాధింపు చర్య అని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడని పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ హయాంలో ఎన్నో కమిటీలు వేసినా ఒక్కటీ నిరూపించలేకపోయారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ.. చంద్రబాబుకు ఏదైనా జరిగితే కర్త, కర్మ, క్రియ జగన్ ప్రభుత్వానిదేనని హెచ్చరించారు. రాజమండ్రి జైలులో పరిశుభ్రత సరిగా లేదు.. దోమలు విపరీతంగా ఉన్నాయన్న అచ్చెన్నాయుడు.. చంద్రబాబు భద్రత (Chandrababu security) పై అనుమానం ఉందని అన్నారు. జైలు నియమాలను అమలు చేస్తున్న సూపరింటెండెంట్ సూపరింటెండెంట్‌పై నిఘా పెట్టారని ఆక్షేపించారు. రాష్ట్రం బాగు కోసం పోరాటమే ఏకైక మార్గం అని అన్నారు.
చంద్రబాబును తప్పుడు కేసులో ఇరికించారు.. కనీస ఆధారం లేకుండా కేసు పెట్టి జైలుకు పంపించారు.. ప్రజాస్వామ్య చరిత్రలో ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదని అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏదైనా కేసు పెట్టాలంటే కనీస ఆధారాలు ఉండాలి.. కేసులో ప్రాథమిక ఆధారాలు లేకుండా అరెస్టు చేశారు.. వాస్తవాలు ఏమీ ప్రజలకు చెప్పడం లేదని దుయ్యబట్టారు. 'దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబును అరెస్టు చేయడంపై యువత రోడ్డెక్కింది.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు.. ఉద్యమాన్ని అణచివేయాలని పోలీసులు చూస్తున్నారు' అని అచ్చెన్నాయుడు తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రజా శ్రేయస్సు కోసం రూ.లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తే.. రూ.330 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రోత్సాహంతో హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్న చాలామంది యువత.. రాజమండ్రిలో చంద్రబాబు కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు వస్తుంటే పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అమలు చేసిన పథకాల విషయంలో ఎక్కడా చిన్న తప్పు కూడా జరగలేదన్న అచ్చెన్న.. చివరకు న్యాయమే గెలుస్తుందని, తమకు తప్పకుండా న్యాయం జరుగుతుందని అన్నారు.
యువగళం పునఃప్రారంభం... టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర వచ్చే వారం పునఃప్రారంభించనున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు. అనుమతులు తీసుకుని పాదయాత్ర చేపడతామన్న ఆయన.. ఉమ్మడి కార్యక్రమాలపై భాగస్వామి జనసేనకు సమాచారం ఇచ్చామని తెలిపారు. జనసేనతో ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టాలని టీడీపీ శ్రేణులకు ఆదేశాలిచ్చామని వెల్లడించారు.