Saffronising Education: 'విద్యను కాషాయీకరణ చేస్తున్నట్లు విమర్శిస్తున్నారు. కానీ కాషాయంతో తప్పేముంది?' అని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. విద్యకు సంబంధించి మెకాలే విధానాన్ని దేశం నుంచి పూర్తిగా తిరస్కరించాలని.. ఇది విదేశీ భాషా మాధ్యమాన్ని రుద్దుతుందని అన్నారు. భారత నూతన విద్యావిధానంలో భారతీయత కేంద్రబిందువని, ఇది మాతృభాషలను ప్రోత్సహించడాన్ని ఉద్ఘాటిస్తుందని చెప్పారు.
హరిద్వార్‌లోని దేవ్ సంస్కృతి విశ్వవిద్యాలయ వద్ద 'సౌత్ ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ రీకన్సీలియేషన్'ను ప్రారంభించిన సందర్భంగా శనివారం ఆయన మాట్లాడారు. మన మాతృభాషను ప్రేమించాలని.. వలసవాద భావజాలాన్ని విడనాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాతృభాష గొప్పతనాన్ని ఆయన వివరించారు. 'మన సంస్కృతి, వారసత్వ సంపద, పూర్వీకులు మనకు గర్వకారణం. మన మూలాల్లోకి వెళ్లాలి. భారతీయ గుర్తింపు మనకు గర్వకారణమని పిల్లలకు చెప్పాలి. వీలయినన్ని ఎక్కువ భారతీయ భాషలను నేర్చుకోవాలి. వేదాలను తెలుసుకోవడానికి సంస్కృతాన్ని నేర్చుకోవాలి' అని ఉప రాష్ట్రపతి అన్నారు. మాతృభాషపై విస్తృత ప్రచారం చేసేలా యువతను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
భగవద్గీతతోనే విలువల పాఠాలు...
భగవద్గీత పాఠాలతోనే నేటి తరానికి విలువలు నేర్పగలమని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై అభిప్రాయపడ్డారు. ప్రాథమిక విద్యలో భగవద్గీత పాఠ్యాంశాల బోధనపై ఆయన శనివారం స్పందిస్తూ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా భగవద్గీతతో విలువ నేర్పించటం సాధ్యమా? అంటూ విలేకరులు వేసిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ భగవద్గీతతో కాకుండా ఇంకెలా చెప్పగలమని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య స్పందిస్తూ... భగవద్గీత బోధనపై తమకెలాంటి అభ్యంతరమూ లేదని, అన్ని మతాల్లోని విలువలనూ నేర్పించే ప్రయత్నం చేయాలని సూచించారు. కేంద్ర మాజీ మంత్రి రహమాన్‌ఖాన్.. నూతన జాతీయ విద్యా విధానాన్ని స్వార్థ ప్రయోజనాలకు కేంద్రం వినియోగించుకుంటోందని ఆరోపించారు.
ఇదీ చూడండి:
భాజపా ఎంపీ కారుపై బాంబు దాడి.. 'కశ్మీర్ ఫైల్స్' చూసొస్తుండగా!