1990లో పారిపోయిన ఓ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 32 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న అతడిని ఎట్టకేలకు పట్టుకున్నారు. దోపిడీ కేసులో నిందితుడైన ఆ వ్యక్తిని తీవ్ర గాలింపుల అనంతరం అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలో ఈ ఘటన జరిగింది. విశ్వనాథ్ అలియాస్ బాల విఠల్ పవార్ అనే వ్యక్తి.. ఇలా పోలీసులు కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
విశ్వనాథ్.. దోపిడీ వంటి పలు కేసుల్లో నిందితుడు. ఇతడిపై ముంబయిలోని బోరివలి పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదయ్యాయి. కాగా 32 ఏళ్ల క్రితం పోలీసులు ఇతడిని అరెస్ట్ చేశారు. అనంతరం దిందోషి సెషన్స్ కోర్టు ముందు హాజరు పరిచారు. ఆ సమయంలో కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసి.. తదుపరి వాదనలకు హాజరు కావాలని ఆదేశించింది. కానీ నిందితుడు తదుపరి వాదనలకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. పోలీసులకు దొరకకుండా.. వివిధ ప్రాంతాలు తిరుగుతూ తప్పించుకుంటున్నాడు.
దీంతో దిందోషి సెషన్స్ కోర్టు అతడిని పరారీలో ఉన్నట్లుగా ప్రకటించింది. అప్పటి నుంచి పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం నిందితుడు సింధుదుర్గ్ జిల్లా పారులేలోని కల్వాడి ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో అతడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపులు చేపట్టారు. కాగా ఠాణే జిల్లా, భయందర్ ఈస్ట్‌లోని ఇంద్రలోక్ ఫేజ్-5లో నిందితుడు ఉన్నట్లుగా పోలీసులకు ఇటీవల సమాచారం అందింది.
అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులకు నిరాశే ఎదురైంది. అప్పటికే నిందితుడు ఇల్లు అమ్మేసి మరో చోటుకి వెళ్లినట్లుగా స్థానికులు తెలిపారు. అయినా.. పోలీసులు పట్టు విడవకుండా గాలింపులు చేస్తునే ఉన్నారు. పోలీసులకు శనివారం మరోసారి నిందితుడి గురించి సమాచారం అందింది. ఈ సారి ఇంద్రలోక్ ఫేజ్-6లో నిందితుడు ఉన్నట్లుగా పోలీసులకు తెలిసింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.