ACB court allows CID to confiscate Lingamaneni guesthouse: లింగమనేని గెస్ట్‌హౌస్ జప్తునకు విజయవాడ ఏసీబీ కోర్టు సీఐడీకి అనుమతులు ఇచ్చింది. గెస్ట్‌హౌస్ జప్తునకు సీఐడీ వేసిన పిటిషన్‌ను అనుమతించిన కోర్టు... లింగమనేని రమేశ్‌కు నోటీసు ఇవ్వాలని ఆదేశించింది.
కేసులు నమోదు చేసిన సీఐడీ... రాజధాని నగర బృహత్ ప్రణాళిక, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పులో అవినీతి జరిగిందనే ఆరోపణలతో ఏపీ సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివసిస్తున్న వ్యాపారవేత్త లింగమనేని రమేశ్ ఇంటిని జప్తు చేసేందుకు సీఐడీకి అనుమతులు ఇస్తూ.. ఈ ఏడాది మే 12న సీఐడీకి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో లింగమనేని ఇంటిని జప్తు చేసేందుకు అనుమతి కోరుతూ సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.
క్విడ్ ప్రో కో జరిగిందని.. ఇంటి జప్తు అభ్యర్థన విషయంలో ఈ నెల 16న సీఐడీ అధికారిని విచారించిన ఏసీబీ కోర్టు.. జప్తు అభ్యర్థనకు ప్రాథమిక ఆధారాలేమిటని ప్రశ్నించింది. ఇంటి నిర్మాణం ఎప్పుడు జరిగింది అంటూ సీఐడీ అదనపు ఎస్పీ జయరాజ్‌ను ప్రశ్నిచిన కోర్టు... జప్తునకు అనుమతించాలా, లేదా అనేదానిపై ఈ నెల 28న నిర్ణయం వెల్లడిస్తామని ప్రకటించింది. అంతకుముందు లింగమనేని తరఫు న్యాయవాది స్పందిస్తూ.. తమకు వాదనలు చెప్పుకునే అవకాశం ఇవ్వాలంటూ వేసిన అనుబంధ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో హైకోర్టును ఆశ్రియించినట్లు తెలిపారు. త్వరలో విచారణకు వచ్చే అవకాశం ఉన్నందున ఇక్కడ విచారణ వాయిదా వేయాలని కోరగా... హైకోర్టు నుంచి తమకు ఉత్తర్వులేవీ రాలేదని చెప్పి న్యాయాధికారి విచారణను కొనసాగించారు. మరోవైపు లింగమనేని ఇంటి విషయంలో క్విడ్ ప్రో కో జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఏఎస్పీ.. ఏసీబీ కోర్టుకు విన్నవించారు. ఈ క్రమంలో తాము సేకరించిన ప్రాథమిక ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ఆధారాలను పరిగణలోకి తీసుకొన్న న్యాయస్థానం.. ఈ నెల 28న ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది.
హైకోర్టును ఆశ్రయించిన లింగమనేని.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా ఉండవల్లిలో నివసిస్తున్న వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌కు చెందిన ఇంటి జప్తునకు అనుమతి ఇవ్వాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ దరఖాస్తు చేసింది. దానిపై ఈ నెల 2న విచారణ చేపట్టగా.. సీఐడీ తరఫున ప్రత్యేక పీపీ వాదనలు వినిపించారు. క్రిమినల్ లా సవరణ ఆర్డినెన్స్-1944 నిబంధన ప్రకారం ఎటాచ్‌మెంట్‌కు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి ముందే ప్రతివాదులకు నోటీసు ఇచ్చి, వాదనలు వినాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దీనిపై లింగమనేని తరఫు న్యాయవాది మాట్లాడుతూ... ఇన్‌ఛార్జి కోర్టు మే 18న తమకు నోటీసులు జారీ చేసిందని, జప్తు పిటిషన్‌పై వాదనలు చెప్పుకొనే అవకాశం కల్పించాలని కోరారు. కాగా, ఏసీబీ కోర్టు నిరాకరించడంతో లింగమనేని హైకోర్టులో అప్పీల్ వేశారు. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు రద్దు చేసి.. తమకు వాదనలు చెప్పుకునే అవకాశాన్ని కల్పించాలని కోరారు. ఈ నేపథ్యంలో వాదనలు వినిపించేందుకు అవకాశమిస్తే తప్పేముందని సీఐడీని ప్రశ్నించిన హై కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.