గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలిసారి బరిలో నిలిచిన ఏఐఎంఐఎం, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లు సత్తా చాటాయి. మొత్తం ఆరు పురపాలికలకు ఎన్నికలు జరగ్గా.. సూరత్‌లో ఆప్ 27 సీట్లను గెలుచుకుంది. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించడం విశేషం.
మరోవైపు, తొలిసారి గుజరాత్ స్థానిక సంస్థల్లో పోటీకి దిగిన.. మజ్లిస్ పార్టీ సైతం రాణించింది. అహ్మదాబాద్‌లో ఏడు స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. భాజపా కంచుకోటగా భావించే గుజరాత్లో ఈ మేరకు ఫలితాలను సాధించడం విశేషమనే చెప్పాలి.
భాజపా జోరు-కాంగ్రెస్ బేజారు
మొత్తంగా ఫలితాల్లో భాజపానే ఆధిక్యం కనబర్చింది. 576 స్థానాలకు ఏకంగా 483 చోట్ల విజయ దుందుబి మోగించింది. కాంగ్రెస్ కేవలం 55 స్థానాలకే పరిమితమైంది. సూరత్‌లో ఖాతా కూడా తెరవలేకపోయింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు గట్టిపోటీ ఇచ్చిన కాంగ్రెస్.. స్థానిక ఎన్నికల్లో మాత్రం చతికిలపడింది. పట్టణ కేంద్రాల్లో ఆప్ పోటీకి దిగడం కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారింది. సూరత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చాటడం వల్ల అక్కడ కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయింది. ఎంఐఎం ఎంట్రీ కూడా కాంగ్రెస్‌ను దెబ్బకొట్టింది.
ఇదీ చదవండి: పురపోరులో భాజపా జయభేరి- 483 స్థానాల్లో గెలుపు