మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో స్కూల్ బస్సు డ్రైవర్ దారుణానికి ఒడిగట్టాడు. మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడితో పాటు అతనికి సహకరించిన మహిళా అటెండర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయమై స్కూల్ యాజమాన్యాన్ని సంప్రదించగా.. వారు దీన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితురాలి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్ర.. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటానని తెలిపారు.
అసలేం జరిగింది :
మూడున్నరేళ్ల చిన్నారి ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటోంది. రోజూ బస్సులో స్కూల్‌కు వెళ్లేది. పాఠశాల నుంచి ఇంటికి వెళ్లేందుకు గురువారం యథావిధిగా స్కూల్ బస్సుకు ఎక్కింది. అయితే, ఆ బస్సు డ్రైవర్ చిన్నారిపై కన్నేశాడు. ఆ పాపపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బస్సులో ఉన్న మహిళా అటెండర్ సహాయంతో బ్యాగ్‌లోని దుస్తులను తీసి చిన్నారి డ్రెస్‌ను మార్చేశాడు. అనంతరం పాపను ఇంటి వద్ద దింపేశాడు.
పాప ఒంటిపై వేరే దుస్తులు ఉన్న విషయాన్ని గమనించిన చిన్నారి తల్లి.. స్కూల్ యాజమాన్యాన్ని ఆరా తీసింది. వారు ఆ పని మేము చేయలేదని వివరణ ఇచ్చారు. అనంతరం, చిన్నారి తన ప్రైవేట్ భాగాల్లో నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు చిన్నారిని దగ్గరికి తీసుకొని ఏం జరిగిందో చెప్పాలని అడిగారు. దీంతో చిన్నారి అసలు విషయం చెప్పింది. బస్సు డ్రైవర్ తనతో చెడుగా ప్రవర్తించాడని, దుస్తులు కూడా అతడే మార్చాడని తెలిపింది.
మరుసటిరోజు పాపను తీసుకుని స్కూల్‌కు వెళ్లగా నిందితుడిని చిన్నారి గుర్తుపట్టింది. ఆగ్రహించిన తల్లిదండ్రులు సోమవారం పోలీస్‌స్టేషన్‌లో వారిద్దరిపై ఫిర్యాదు చేశారు. సెక్షన్ 376-ఏబీ, పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి విచారణను ప్రారంభించారు. బాధితురాలి మెడికల్ రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉండగా, ఘటన జరిగిన ప్రదేశాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
హోంమంత్రి స్పందన...
ఈ వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ విమర్శలకు కారణమైంది. ఘటనపై స్పందించిన హోంమంత్రి నరోత్తమ్ మిశ్ర.. నిందితులను పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. 'ఈ ఘటనలో పాఠశాల యాజమాన్యం పాత్ర ఏంటన్న విషయంపై దర్యాప్తు చేస్తాం. స్కూల్ సిబ్బందిని ప్రశ్నిస్తాం. దీన్ని కప్పిపుచ్చేందుకు పాఠశాల యాజమాన్యం ప్రయత్నించినట్లు తెలిసింది. దర్యాప్తు చేపట్టి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం' అని హోంమంత్రి అన్నారు. కాగా, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని కాంగ్రెస్ మండిపడింది. భాజపా పాలిత రాష్ట్రాల్లో మహిళలు, బాలికలకు రక్షణ లేదని ఆరోపించింది. ఘటనకు బాధ్యత వహించి హోంమంత్రి మిశ్ర రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.