కేరళ కోజికోడ్ జిల్లాలోని కొట్టూర్ గ్రామ పంచాయతీ క్రమంగా పోషకాహార పంటల సాగులో స్వయం సమృద్ధి సాధిస్తోంది. పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు శ్రీకారం చుట్టిన న్యూట్రిషన్ గార్డెన్ (పోషకాహార తోట) ప్రాజెక్టు.. కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) ఆధ్వర్యంలో విజయవంతంగా అమలవుతోంది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైస్ రీసర్చ్ (ఐఐఎస్ఆర్) భాగస్వామ్య సంస్థ అయిన కేవీకేతో కలిసి అధికారుల బృందం.. ఈ పోషకాహార తోట ప్రాజెక్టు పర్యవేక్షణ, నిర్వహణ చూసుకుంటోంది. ఈ కార్యక్రమంలో భాగంగా కొట్టూరు పంచాయతీలో 25 కుటుంబాలకు కూరగాయల విత్తనాలు పంపిణీ చేశారు. పిల్లలు, యుక్తవయస్సు వారు, గర్భణీలకు సరైన పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టులో స్థానికంగా ఉండే మూడు అంగన్వాడీలను కూడా భాగం చేశారు.
పోషకాహారంలో స్వయం సమృద్ధి సాధించేందుకు వారికి శిక్షణ కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానంగా కూరగాయల సాగు, సేంద్రీయ వ్యవసాయం, వానపాముల కంపోస్టింగ్ వంటి కీలకమైన అంశాలపై శిక్షణ ఇస్తున్నారు.
ఆహార భద్రతలో న్యూట్రిషన్ గార్డెన్ అద్భుతమైన నమూనాగా పేర్కొన్నారు ఐఐఎస్ఆర్ డైరెక్టర్ డాక్టర్ సంతోష్ జే ఈప్పన్. పిల్లలకు పూర్తిస్థాయిలో పోషకాహారాన్ని అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో చేపట్టిన 'స్మార్ట్ న్యూట్రిషన్ విలేజ్ స్కీం' కింద ఈ పోషకాహార తోట కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. ఏడాది పాటు లబ్ధిదారులకు అన్ని విధాల సాయం అందించి.. ఆ తర్వాత మరిన్ని గ్రామాలకు విస్తరించనున్నట్లు తెలిపారు.
నాణ్యమైన విత్తనాల పంపిణీ..
ఏడాది పాటు సాగే ఈ కార్యక్రమంలో స్థానికంగా, పరిసర ప్రాంతాల్లో దొరికే నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసి లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. వాటితో పాటు వంటింటి కంపోస్ట్ ఎరువులను కూడా అందజేస్తారు. ఇంట్లోని వంటింటి వ్యర్థాలతో కంపోస్ట్ ఎరువు తయారు చేసి కూడా వినియోగించవచ్చు.
ఇదీ చూడండి: 2 చేతులతో 4 భాషల్లో ఎటు నుంచి ఎటైనా రాసేస్తా!