ఓ యువకుడు రాత్రివేళ ఒక ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతని కదలికల చప్పుడు విన్న ఇంటి యజమాని దొంగ దొంగ అని గట్టిగా అరిచాడు. దీంతో ఆ యువకుడు బయటకు పరుగులు తీశాడు. ఈ చప్పుళ్లు విన్న గ్రామస్థులు అతడిని వెంబడించి పట్టుకున్నారు. దొంగతనం చేసేందుకు వచ్చాడని చితకబాయబోయారు. ఇంతలోనే ఆ కుర్రాడు అసలు విషయం చెప్పాడు. తాను దొంగతనానికి రాలేదని, ప్రేయసిని కలిసేందుకు వచ్చానని తెలిపాడు. ఇది విన్న వారంతా ఆ అమ్మాయిని పిలిపించి నిజమా? కాదా అని అడిగారు. అతడు తన లవరే అని ఆ యువతి బదులిచ్చింది.
దీంతో గ్రామస్థులంతా కలిసి ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించారు. అబ్బాయి తండ్రికి ఫోన్ చేసి పిలిపించారు. అప్పటికప్పుడు ఊరి మధ్యలో అందరి సమక్షంలో పెళ్లి జరిపించారు. వారి సంప్రదాయం ప్రకారం అబ్బాయి.. అమ్మాయి నుదుటికి బొట్టు పెడితే వివాహం జరిగినట్లు.
అయితే పెళ్లి విషయం గురించి పోలీసులకు తెలిసింది. ఇరు కుటంబాలకు వారు పోలీస్ స్టేషన్కు పిలిపించి ఆరా తీశారు. విచారణలో అమ్మాయికి 19 ఏళ్లు, అబ్బాయికి 16 ఏళ్లే అని తెలిసింది. బాలుడ్ని పెళ్లి చేసుకోవడం చట్టప్రకారం చెల్లదని పోలీసులు తేల్చిచెప్పారు. దీంతో గ్రామపెద్దలు పెళ్లి రద్దు చేయించారు. అబ్బాయి.. అమ్మాయి నుదిటికి పెట్టిన బొట్టును తుడిపించారు.
ఝార్ఖండ్ గఢ్వా(Jharkhand garhwa)లోని మఝిగవా(marriage lasted 6 hours) గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది. అబ్బాయి తండ్రి పేరు రాకేశ్ రజ్వార్ కాగా.. అమ్మాయి తండ్రి పేరు తేత్రి కుంవర్. శుక్రవారం రాత్రి అమ్మాయిని కలిసేందుకు అబ్బాయి వెళ్లాడు. శనివారం ఉదయం పెళ్లి జరగ్గా.. ఆరు గంటల వ్యవధిలో వివాహం రద్దైంది.
ఇదీ చదవండి: ఆకాశంలో అత్యంత దగ్గరగా వచ్చిన విమానాలు.. అదృష్టవశాత్తూ...