female priest : సాధారణంగా ఏ దేవాలయానికి వెళ్లినా.. పురుష అర్చకులు అర్చనలు, అభిషేకాలు, ఇతర పూజలు చేస్తూ ఉంటారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగి, ఎంతో పాముఖ్యత గల మహిమాన్విత దేవాలయంలో ఆమె అర్చకురాలిగా దాదాపు 42 ఏళ్లుగా కొనసాగుతున్నారు. కృష్ణాజిల్లా, ఘంటసాల మండలం, ఘంటసాల గ్రామంలో వెలసిన శ్రీ విశ్వేశ్వరాలయంలో ఘంటసాల విజయలక్ష్మి తన చిన్నతనం నుంచి తండ్రితో కలిసి స్వామివారికి పూజలు చేస్తున్నారు. వీరు గాన గంధర్వ ఘంటసాల వెంకటేశ్వరరావు కుటుంబీకులే కావడం విశేషం. వీరి తండ్రి పేరు కూడా ఘంటసాల వెంకటేశ్వరరావు కావడం గమనార్హం. వరుసకు మనవరాళ్లు అవుతారు. తండ్రి ఘంటసాల వెంకటేశ్వరరావు తదనంతరం 1981 సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో అర్చకత్వం బాధ్యతలు నిర్వహిస్తూ భక్తుల మన్నలు పొందుతున్నారు. గ్రామస్తులు, మహిళల్లో భక్తి సంబంధిత విషయాలు బోధిస్తుంటారు.
వారసత్వంగా అందివచ్చిన అవకాశం.. తన తండ్రి, తాత, ముత్తాతలు ఘంటసాల గ్రామంలో ఏడు తరాలుగా నివాసం ఉండటం... వంశ పారంపర్యంగా శ్రీ విశ్వేశ్వరాలయం ఇతర ఆలయాల్లో అర్చకత్వం నిర్వహిస్తూ ఉండేవారు. ఘంటసాల వెంకటేశ్వరరావు కు నలుగురు కూతుళ్లు. వారిలో విజయలక్ష్మి, మాధవీలత అవివాహితులుగానే ఉండిపోయారు. మాధవీలత ఉపాధ్యాయురాలిగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. అర్చక పరీక్షల్లోనూ ఉత్తీర్ణులై పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఆలయంలో ప్రస్తుతం అర్చకర్వం నిర్వహిస్తున్న విజయలక్ష్మి ఎంఏ బీఈడీ పూర్తి చేయడంతో పాటు బాషా ప్రవీణ్ ఉత్తీర్ణత సాధించారు. పొద్దుటూరులో టీచర్ ట్రైనింగ్ పొంది అర్చక పరీక్షల్లో ఉత్తీర్ణత పొందానని తెలిపారు.
అర్చకత్వం మా హక్కు.. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని విజయలక్ష్మి బలంగా ఆశిస్తున్నారు. మహిళలు పైలెట్లుగా, వైద్యులుగా, న్యాయవాదులుగా పనిచేస్తూనే ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చేలా వేలాది మందికి విద్యాబుద్ధులు బోధిస్తున్నారని గుర్తు చేస్తూ... అర్చకత్వం కూడా చేయగలరని తెలిపారు. అర్చకత్వం చేసేందుకు మహిళలకు హక్కు కూడా ఉన్నదని ఆమె వెల్లడించారు. ఆలయంలో తన చెల్లి మాధవీలత కూడా అర్చకత్వం నిర్వహించిందని, స్వామివారికి అభిషేకం, అష్టోత్తరం, అమ్మవారికి లలితా సహస్రనామాలు ఇలా... అన్ని పూజలు చేస్తామని ఆమె తెలిపారు. మహాశివరాత్రి, దసరా పండుగల సమయంలో మాత్రం తమ బంధువులైన పరిచారికులను ఆహ్వానిస్తామని చెప్పారు. భక్తుల ఇబ్బందులకు హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం పరిష్కారాలు తెలియజేసి మన్ననలు పొందుతున్నారు. గ్రామంలో వివాహాది వ్రతాలు, పూజలు ఎంతో నిష్టగా నిర్వహిస్తున్నారు.
చారిత్రక ఆలయంలో సేవలు.. ఘంటసాల గ్రామంలో విశ్వేశ్వర ఆలయాన్ని 1840 సంవత్సరం లో పున: ప్రతిష్ట చేశారు. తదుపరి 1905 సంవత్సరంలో ఆలయ ముఖద్వారం పై గోపుర నిర్మాణం, 1920 సంవత్సరం లో కల్యాణ మండప నిర్మాణం జరిపారని ఆలయంలో ఉన్న శిలాఫలకం ద్వారా తెలుస్తోంది. ఆలయం ముందున్న శిలఫలకాలపై మరిన్ని శాసనాలు ఉన్నాయి. చిన్నతనం నుంచి అర్చకత్వం నిర్వహిస్తూ భక్తుల మన్ననలు పొందుతున్న విజయలక్ష్మి ని గ్రామస్తులు అభినందిస్తూ శాలువాతో సత్కరించారు.
ఇవీ చదవండి :