తుర్కియే, సిరియాలో పెను భూకంపం ఏర్పడి భవనాలన్నీ ధ్వంసం అయ్యాయి. వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలతో బయటపడ్డవారు ఎముకలు కొరికే చలితో నరకం అనుభవిస్తున్నారు. ఇదంతా టీవీలో చూసిన 8 ఏళ్ల బాలుడు వారికోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. తాను ఇన్నేళ్లపాటు కూడబెట్టిన పాకెట్ మనీ మొత్తాన్ని ఖర్చు చేసి కొందరికైనా చలి నుంచి ఉపశమనం కలిగించాలని నిర్ణయించుకున్నాడు. భూకంప బాధితులు చలిని తట్టుకునేందుకు 112 జాకెట్లను కొన్నాడు. ఆ బాలుడే దిల్లీకి చెందిన జైదాన్ ఖురేషీ.
జైదాన్ ఖురేషీ తన తండ్రితో దిల్లీలోని తుర్కియే రాయబార కార్యాలయానికి వెళ్లి భూకంప బాధితులకు ఇవ్వమని 112 జాకెట్లను అందించాడు. 'కొన్ని రోజుల క్రితం టీవిలో తుర్కియేలో భూకంపం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలను చూశా. బాధితులకు ఏదైనా సాయం చేయాలని నిర్ణయించుకున్నా. అప్పుడు నా తండ్రికి ఇదే విషయం చెప్పా. ఆయనా భూకంప బాధితులకు ఏదైనా సాయం చేద్దామని అన్నారు.' అని జైదాన్ చెప్పాడు.
![a boy donated his pocket money for turkey earthquake victims](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17749300_boy.jpg)
![a boy donated his pocket money for turkey earthquake victims](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17749300_boyyy.jpg)
పాకెట్ మనీతో సహాయం
జైదాన్ తన తండ్రి నుంచి ప్రతిరోజూ రూ.100 పాకెట్ మనీగా తీసుకుని కొంత డబ్బును కూడబెట్టాడు. తుర్కియే ప్రజలకు సహాయం చేయాలనుకున్న తర్వాత జైదాన్ తండ్రి తన పాకెట్మనీకి మరి కొంత డబ్బు కలిపి 112 జాకెట్లను కొన్నాడు. వాటిని వారు తుర్కియే రాయబార కార్యాలయం ద్వారా ఆ దేశ ప్రజల కోసం పంపించారు.
"112 జాకెట్ల కొనుగోలుకు రూ.22వేలు ఖర్చు అయ్యింది. దానిలో రూ. 7,500 నా కుమారుడి జైదాన్ పాకెట్ మనీ. మిగతా డబ్బులను నేను కలిపి భూకంప బాధితులకు అండగా నిలబడేందుకు జాకెట్లు కొన్నాం. ఆపదలో ఉన్నవారికి ఎవరు సహాయం చేసినా అల్లా వారికి సహాయం చేస్తారనేది మహ్మద్ ప్రవక్త సూక్తి. అందుకే నేను, నా కొడుకు భూకంప బాధితులకు సహాయం చేశాం."
--కాశిఫ్ ఖురేషీ, జైదాన్ తండ్రి
ఇటీవల తుర్కియే, సిరియాలో సంభవించిన భూకంపం వల్ల 35వేల మందికి పైగా మరణించారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. తుర్కియే, సిరియా ప్రభుత్వాలు ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుండగా, ఇతర దేశాలు కూడా ఈ కష్టకాలంలో వారికి అండగా నిలుస్తున్నాయి. అయినప్పటికీ ఇతర వ్యక్తులు తాము చేయాలనుకున్న సహాయాన్ని దిల్లీలోని తుర్కియే, సిరియా రాయబార కార్యాలయాలలో ఇచ్చి వారికి అందేలా చేస్తున్నారు.
![a boy donated his pocket money for turkey earthquake victims](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17749300_boyy.jpg)