దేశవ్యాప్తంగా తెలంగాణ సహా 59 స్థానాల్లో ఉపఎన్నికలు జరగ్గా.. ఝార్ఖండ్, ఛత్తీస్‌గడ్, హరియాణా, ఒడిశా, నాగాలాండ్ మినహా మిగిలిన అన్ని చోట్లా భాజపా సత్తా చాటింది. మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని పదిలపరుచుకోవాల్సిన స్థానాలకు మించి సాధించిన కమల దళం గుజరాత్‌లో 8 స్థానాలను స్వీప్ చేసింది.
దేశంలో 11 రాష్ట్రాల్లో 59 స్థానాలకు ఉపఎన్నికలు జరగగా వాటిలో మెజార్టీ స్థానాలను భాజపా కైవసం చేసుకుంది. ఉపఎన్నికల్లో అత్యంత కీలకమైన మధ్యప్రదేశ్‌లో మొత్తం 28 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా 19 చోట్ల భాజపా విజయఢంకా మోగించింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 230 స్థానాలుండగా భాజపా ఖాతాలో ఇప్పటివరకూ ఉన్న 107 సీట్లకు ఈ 19 స్థానాలు తోడయ్యాయి. ఫలితంగా..126 సీట్లతో మధ్యప్రదేశ్‌లో భాజపా అధికారాన్ని నిలబెట్టుకుంది. 28 స్థానాల్లో కాంగ్రెస్‌కు చెందినవి 25 కాగా.. ఆ పార్టీ 9 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరిన జోతిరాదిత్య సింధియా.. తన వెంట వచ్చిన వారందరినీ గెలిపించుకోవడంలో విజయవంతమయ్యారు.
అక్కడ క్లీన్‌స్వీప్..
- గుజరాత్‌లో 8 స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా అన్నింటా భాజపా గెలిచింది. రాజ్యసభ ఎన్నికల ముందు గుజరాత్‌లో 8 మంది కాంగ్రెస్ సభ్యులు రాజీనామా చేయడంతో ఉపఎన్నికలు జరిగాయి. వారిలో ఐదుగురు భాజపా గూటికి చేరి పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని కూడా నిలుపుకోలేకపోయింది.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో 7 స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా.. 6 చోట్ల కమలదళం గెలిచింది. ఒకచోట సమాజ్‌వాదీ పార్టీ విజయం సాధించింది. మణిపుర్‌లో 4 స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో భాజపా మూడు చోట్ల జయభేరి మోగించింది. స్వతంత్ర అభ్యర్థి ఓ చోట గెలిచారు.
- నాగాలాండ్‌లో రెండు స్థానాలకు ఉపఎన్నిక జరగ్గా ఒకచోట ఎన్డీపీపీ, మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.
ఝార్ఖండ్‌లో రెండుచోట్ల ఉపఎన్నికలు జరగగా అధికార జేఎంఎం, కాంగ్రెస్ చెరో స్థానంలో విజయం సాధించాయి. హరియాణాలో ఒక స్థానానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది. ఛత్తీస్‌గఢ్‌లోని ఒక స్థానానికి ఉపఎన్నిక జరగ్గా అధికార కాంగ్రెస్ జయభేరి మోగించింది. కర్ణాటకలో రెండు నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే రెండింటినీ కమలదళం కైవసం చేసుకుంది. ఒడిశాలోని రెండు నియోజకవర్గాల్లోనూ అధికార బీజేడీ విజయం సాధించింది. తెలంగాణలో ఒక స్థానానికి ఉపఎన్నిక జరగ్గా భాజపా కైవసం చేసుకుంది.