Boy Fell In Borewell: పంజాబ్‌లోని హోషియార్‌పుర్‌లో ఆరేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు 300 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఎనిమిది గంటలు శ్రమించి బయటకు తీసినా.. లాభం లేకుండా పోయింది. బాలుడు మృతి చెందాడు.
ఏం జరిగిందంటే.. గర్డివాలా సమీపంలోని బెహ్రాంపుర్ గ్రామంలో ఉండే రితిక్ రోషన్ (6) తన ఇంటి పరిసరాల్లో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో వీధి కుక్కలు వెంటపడగా.. బాలుడు పరిగెత్తాడు. శునకాలను తప్పించుకునే ప్రయత్నంలో రితిక్ పక్కనే ఉన్న బోరుబావి పైపుపైకి ఎక్కాడు. బాలుడి బరువుకు బోరుబావి పైపు కప్పి ఉన్న గోనె సంచి చిరిగిపోయి అందులో పడిపోయాడు. బాలుడు వలస కూలీల కుటుంబానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బాలుడి పరిస్థితిని పర్యవేక్షించేందుకు బోర్‌బావిలో కెమెరా అమర్చటం, పైపుల ద్వారా బాలుడికి ఆక్సిజన్ అందించారు.
బోరుబావిలో పడిన ఆరేళ్ల బాలుడు రితిక్‌ను సుమారు ఎనిమిది గంటలు కష్టపడి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయటకు తీసినా లాభం లేకుండా పోయింది. చిన్నారిని ఆసుపత్రికి తీసుకొచ్చేసరికి శరీరం బాగా బిగుసుకుపోయిందని, బోరుబావిలోనే మృతి చెంది ఉంటాడని డాక్టర్ మనీశ్ కుమార్ తెలిపారు. వెంటిలేటర్‌పై ఉంచినా చిన్నారి ప్రాణాలను కాపాడలేకపోయామని చెప్పారు.
అంతకు ముందు బాలుడి పరిస్థితిపై జిల్లా యంత్రాంగంతో తాను నిరంతరం టచ్‌లో ఉన్నానని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు. జిల్లా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే ఘటనాస్థలిలోనే ఉండి పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. బోరుబావిలో పడిన బాలుడు సురక్షితంగా బయటకు రావాలని.. దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి: బంగాల్లో బాంబుల కలకలం.. ప్లాస్టిక్ టబ్బుల నిండా
పోలీస్ స్టేషన్‌కు నిప్పు.. బుల్డోజర్లతో నిందితుల ఇళ్లు కూల్చివేత