భారత్ తయారు చేసిన టీకాలకు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) 8 వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులు జారీ చేస్తే.. అందులో రెండు(కొవిషీల్డ్, కొవాగ్జిన్) టీకాలు భారత్‌కు చెందినవి ఉండటం గర్వకారణమని అన్నారు. 96 దేశాలు ఈ రెండు టీకాలను గుర్తించాయని చెప్పారు. టీకా ధ్రువీకరణ పత్రాన్ని (India Vaccination Certificate) పరస్పరం ఆమోదించుకునేందుకు ఈ దేశాలు అంగీకారం తెలిపాయని చెప్పారు. కొవిన్ యాప్‌లో ఈ దేశాల జాబితా అందుబాటులో ఉందని తెలిపారు.
మరిన్ని దేశాల్లో టీకా ధ్రువీకరణ పత్రానికి (Covid Vaccine Certificate) గుర్తింపు కోసం భారత్ ప్రయత్నిస్తోందని మాడవీయ స్పష్టం చేశారు. భారత టీకాలకు గుర్తింపునిచ్చిన దేశాలకు వెళ్తే ప్రయాణ ఆంక్షలకు మినహాయింపు ఉంటుందని తెలిపారు.
దేశంలో ఇప్పటివరకు 109 కోట్లకు పైగా టీకా డోసులను పంపిణీ (Vaccination in India) చేసినట్లు మాండవీయ తెలిపారు. వైద్య కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి టీకాలను వేస్తున్నారని చెప్పారు.
ఇదీ చదవండి: అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా 'గ్రామం'.. భారత్ స్పందన ఇదే!