grand mother driving licenses: ఆమె స్టీరింగ్ పట్టారంటే ఏ వాహనాన్నైనా అలవోకగా నడుపుతారు... డ్రైవింగ్ స్కూల్లో వందల మందికి కారు నడపటం నేర్పుతారు... జేసీబీలు, క్రేన్లను కూడా పరుగులు పెట్టించగలరు... ఆమె పేరే రాధామణి. వయసు 72 ఏళ్లు. అయితేనేం 11 లైసెన్స్‌లు ఆమె చేతిలో ఉన్నాయి. విమాన పైలట్, లోకో పైలట్ మినహా అన్ని లైసెన్స్‌లు పొందారు. వయసు సహకరించకపోవడం వల్లే గానీ.. లేదంటే ఆ రెండు లైసెన్స్‌లు కూడా సంపాదించేదాన్నని అంటున్నారు.
కేరళలోని ఎర్నాకులం జిల్లాకు చెందిన రాధామణిని స్థానికులు మణమ్మ అని ముద్దుగా పిలుస్తారు. ఈమె కొచ్చిలోని తోప్పంపాడిలో డ్రైవింగ్ స్కూల్‌ను నడుపుతున్నారు. ఈ స్కూల్‌ను నడపాలంటే తనకి అన్ని వాహనాల వచ్చి ఉండాలని.. ద్విచక్ర వాహనాలు, తేలికపాటి మోటారు వాహనాలు, భారీ మోటారు వాహనాలు, జేసీబీలు, క్రేన్లు, ట్రైలర్‌లు, రోడ్ రోలర్‌ను నడపడం నేర్చుకున్నారు.
1991లో భర్త ప్రోత్సాహంతో మణమ్మ కారును నడపడం నేర్చుకున్నారు. ఆ సమయంలో గ్రామస్థులు హేళన చేసేవారు. అయినప్పటికీ పట్టించుకోకుండా పట్టుదలతో డ్రైవింగ్ నేర్చుకున్నారు. కేరళలో హెవీ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్లు ఉండేవి కావు. ప్రభుత్వంతో న్యాయపోరాటం చేసి ఇప్పుడు తనే ఒక హెవీ డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్‌ని నడుపుతున్నారు.
తాను నడిపిన వాహనాల్లో జేసీబీ చాలా కష్టంగా అనిపించిందని రాధామణి తెలిపారు. మహిళలను డ్రైవింగ్ రంగంలో ప్రోత్సహించేందుకు కృషి చేస్తానని అంటున్నారు. ఈ రంగంలో మహిళలకు అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
ఇదీ చదవండి: సీఎంపై గెలిచి ఎమ్మెల్యే అయిన కుమారుడు.. తల్లి మాత్రం బడిలో స్వీపర్‌గానే..