సరిహద్దుల గుండా భారత్లోకి మాదక ద్రవ్యాలు చేరేవేసే కుట్రను భగ్నం చేశాయి భద్రతా దళాలు. పంజాబ్ తరన్ తరన్ జిల్లాలోని సరిహద్దుల వద్ద శనివారం తెల్లవారు జామున అనుమానస్పద కదలికలను గుర్తించాయి బీఎస్ఎఫ్ బలగాలు. ఈ క్రమంలో ప్రమాదం పొంచి ఉన్నట్లు భావించి కాల్పులు చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. భద్రతా సిబ్బంది కాల్పుల్లో ఓ చొరబాటు దారుడు హతమైనట్లు చెప్పారు.
శనివారం ఉదయం మాదక ద్రవ్యాల నియంత్రణ బోర్డుతో పాటు సరిహద్దులో తనిఖీలు నిర్వహించారు భద్రతా సిబ్బంది. ఈ క్రమంలో మృతదేహం సమీపంలో సుమారు రూ.70 కోట్ల విలువైన 14 ప్యాకెట్ల హెరాయిన్, ఓ తుపాకీ, ఆరు రౌండ్ల తూటాలు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ముంబయిలో రూ.3.5 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
ముంబయిలో సుమారు రూ.3.5 కోట్ల విలువైన 1800 కిలోల గంజాయిని పట్టుకున్నారు మాదక ద్రవ్యాల నియంత్రణ బోర్డు అధికారులు. ఒడిశా నుంచి ఆటోరిక్షాలో తీసుకొచ్చి ముంబయిలోని విఖ్రోలి ప్రాంతంలో ఓ గోడౌన్లో నిలువ చేస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. గోడౌన్ యజమాని, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.