వేగంగా ప్రయాణిస్తున్న ఓ వ్యాన్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్న ఘటనలో తొమ్మిది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని ధర్వాద్ ప్రాంతంలోని బాదా గ్రామంలో జరిగింది. నిశ్చితార్థ వేడుకలకు హాజరై తిరిగి వస్తుండగా ఈ విషాదం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి సుమారు 1 గంటకు ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్లో 20 మంది ప్రయాణిస్తున్నట్లు పేర్కొన్నారు.
ధర్వాద్లోని మనసుర నుంచి బెనక్కాని గ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతిచెందిన వారిలో నీలవ్వ(60), శిల్పా(34), మధుశ్రీ(20), మహేశ్వరయ్య(11), శింబులింగయ్య(35) అనన్య(14), హరీశ్(13)గా ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. చనవ్వా (45), మనుశ్రీ అనే మరో ఇద్దరు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గాయపడిన వారిని హుబ్బళిలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
కారు,ట్రాక్టర్ ఢీ.. ఆరుగురు మృతి: ఉత్తర్ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, కారు ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురు మరణించగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. బలరాంపుర్లోని తులసిపుర్-బర్హిని జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బసంత్(32), అతడి భార్య అమృత(28), లక్ష్మణ్(40), వాడి(35), షాదాబ్(26) అక్కడిక్కడే మరణించగా.. అంకిత్(13) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. తీవ్ర గాయాలపాలైన ఉమేశ్(13)ను లఖ్నవూ ఆస్పత్రికి.. మరో ఇద్దరిని బలరాంపుర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించామని.. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: పట్టపగలే నడిరోడ్డుపై ఫైనాన్స్ వ్యాపారి దారుణ హత్య..