బిహార్ రాష్ట్ర మంత్రులుగా మంగళవారం ప్రమాణస్వీకారం చేసిన 14మందిలో 8మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు మంత్రులు తమ అఫిడవిట్లో పేర్కొన్నారని ఏడీఆర్ సంస్థ తెలిపింది. ఇది మొత్తం మంత్రుల్లో 57 శాతమని వెల్లడించింది. వీరిలో ఆరుగురు మంత్రులపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయని పేర్కొంది. ఇవి నాన్-బెయిల్ కేసులని, రుజువైతే ఐదేళ్లు శిక్షపడే అవకాశం ఉందని వివరించింది.
8మంది వీరే
వీరిలో జేడీయూకు చెందిన మంత్రులు ఇద్దరు, భాజపా మంత్రులు నలుగురు, హిందుస్థానీ అవామ్ మోర్చా నుంచి ఒక్కరు, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ నుంచి ఒక్కరు ఉన్నారు.
మొత్తం 14మంది మంత్రుల్లో 13మంది కోటీశ్వరులని సంస్థ తెలిపింది. వీరిలో ఒక్కొక్కరికి సరాసరి 3.93కోట్లు ఆస్తులు ఉన్నాయని పేర్కొంది. తారాపుర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన మేవా లాల్ చౌదరీ ఆస్తులు అత్యధికంగా 12.31కోట్లని తెలిపింది. మంత్రి అశోక్ చౌదరీకి అతితక్కువగా 72.89లక్షలని నివేదించింది.
మొత్తం మంత్రుల్లో నలుగురికి 8నుంచి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం ఉండగా, 10మందికి డిగ్రీలు ఉన్నాయని పేర్కొంది. 14 మందిలో ఆరుగురు మంత్రులు వయస్సు 41-50 మధ్య ఉంది. ఎనిమిది మంది వయస్సు 51-75 మధ్య ఉందని తెలిపింది. మొత్తం 14మంది మంత్రుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని నివేదించింది.