పెళ్లిలో కట్నకానుకలు అంటే నగదు, బంగారం, వస్తురూపంలో ముట్టజెబుతారు. మరికొంత మంది వాహనాలు, భూములు ఇస్తారు. కానీ, ఓ పర్యావరణవేత్త తనకు ఇష్టమైన మొక్కలనే వరకట్నంగా అందుకుని యువకులకు ఆదర్శంగా నిలిచాడు. ఈ సంఘటన ఉత్తర్ప్రదేశ్-దిల్లీ సరిహద్దు గాజియాబాద్ జిల్లాలోని మురాద్నగర్ ప్రాంతంలో జరిగింది.
జిల్లాలోని సురానా గ్రామానికి చెందిన బాల్ సింగ్ అనే యువకుడి వివాహం ఈనెల 24న సాయంత్రం జరిగింది. ముందు నుంచే వరకట్నాన్ని వ్యతిరేకిస్తున్న సింగ్.. పర్యావరణంపై ప్రేమతో కట్నం కింద 51 మొక్కలను తీసుకొని యువకులకు ఆదర్శంగా నిలిచాడు. వరకట్న వ్యవస్థను రూపు మాపేందుకు ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని కోరాడు.
"సమాజంలో ఇప్పటికీ వరకట్న సంప్రదాయం నడుస్తోంది. అది భవిష్యత్తు తరానికి తప్పుడు సందేశాన్ని అందిస్తోంది. కొందరి వద్ద డబ్బు లేకపోవటం వల్ల కట్నం ఇచ్చేందుకు అప్పు చేస్తున్నారు. అందుకే వరకట్నాన్ని రూపుమాపాలని నిశ్చయించుకున్నా. పర్యావరణ ప్రేమికుడిగా మొక్కలనే డౌరీగా స్వీకరించా. "
- బాల్ సింగ్, నవ వరుడు.
కట్నం తీసుకోకుండా వివాహం చేసుకున్నందుకు తాము చాలా సంతోషిస్తున్నామని బాల్ సింగ్ బంధువులు తెలిపారు. అందుకు బదులుగా మొక్కలను తీసుకోవటం ద్వారా పర్యావరణం పట్ల ప్రజల్లో ప్రేమ పెరుగుతుందన్నారు.
ఆ గ్రామంలో చాలా మంది యువత ఎలాంటి కట్నం ఆశించకుండానే వివాహం చేసుకున్నారు.
బాల్సింగ్ పర్యావరణాన్ని ఎంతగానో ప్రేమిస్తాడని గ్రామస్థులు తెలిపారు. వాతావరణమే దేవుడిగా నమ్ముతాడని, భూమిపై ఉన్న వాతావరణం, నదులు, కొండలు విలువైనవని ఎప్పుడూ చెబుతాడని తెలిపారు. బాల్సింగ్ సహా చాలా మంది యువకులు వరకట్నానికి బదులుగా మొక్కలను నాటి పెళ్లిళ్లు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. త్వరలోనే తమ గ్రామం వరకట్న రహితంగా మారనుందన్నారు.
ఇదీ చూడండి: 'ఫోన్లో అమ్మ జ్ఞాపకాలు.. ఎలాగైనా తెచ్చివ్వండి'