కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi News) నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌లో(Lakhimpur Kheri News) బుధవారం పర్యటించనుంది. హింసాత్మక ఘటనలో మరణించిన రైతుల కుటుంబాలను రాహుల్ పరామర్శించనున్నారు.
లఖింపుర్ ఖేరి జిల్లాలో ఆదివారం జరిగిన హింసలో నలుగురు రైతులు సహా 8 మంది మరణించారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని (Priyanka Gandhi Latest News) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
అనుమతి ఇవ్వండి..
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. లఖింపుర్ ఖేరీలో బుధవారం రాహుల్ గాంధీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం పర్యటించనుండగా.. ఇందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్, బంగాల్ నుంచి వచ్చిన రాజకీయ నాయకులకు అనుమతించిన విధంగానే రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరారు.
'సీబీఐ విచారణ జరిపించాలి'
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ (Lakhimpur Kheri News) ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతూ ఉత్తర్‌ప్రదేశ్ న్యాయవాదులు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు (CJI News) మంగళవారం లేఖ రాశారు. రైతులపై దూసుకొచ్చిన వాహనం కేంద్రమంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్‌ది అని, అందులో ఆయన కూడా ఉన్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు అతడిని ఎందుకు అరెస్టు చేయలేదని పోలీసులపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం చోటుచేసుకున్న దారుణంపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసేలా హోంమంత్రిత్వశాఖను ఆదేశించాలని పిటిషన్‌లో న్యాయవాదులు సీజేఐని కోరారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మంత్రులను శిక్షించాలన్నారు.
మరోవైపు, ఈ ఘటనలో నలుగురు రైతులు మృతిచెందగా.. ముగ్గురి భౌతికకాయాలకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. మరో రైతు మృతదేహాన్ని రీ-పోస్టుమార్టం చేయనున్నట్టు సమాచారం. రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్, యూపీ పోలీసుల మధ్య చర్చల అనంతరం ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా ఆదివారం నుంచి నిలిపివేసిన ఇంటర్నెట్ సేవలను అధికారులు ఈ సాయంత్రం పునరుద్ధరించారు.
ఇదీ చూడండి: 'రేపటిలోగా ప్రియాంకను విడుదల చేయలేదో'.. సిద్ధూ వార్నింగ్!