అందంగా రంగులు పూసుకొని ఆటాడాల్సిన రోజున కొందరు ఆకతాయిలు కలిసి ఒక జపాన్ అమ్మాయితో అనుచితంగా వ్యవహరించారు. హోలీ రోజున బలవంతంగా జపాన్ యువతికి అందరూ కలిసి రంగులు పూసి అసభ్యంగా ప్రవర్తించారు. పక్కనే ఉన్న వ్యక్తులు వీడియో తీయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అనుచితంగా ప్రవర్తించిన యువకులను పోలీసులు అరెస్ట్ చేసి.. కేసు నమోదు చేశారు. మార్చి 8న ఈ ఘటన దిల్లీలో జరిగింది. ముగ్గురు యువకులు ఒక జపాన్ అమ్మాయిని పట్టుకొని బలవంతంగా రంగులు పూయడం, తలపై గుడ్డు పగుల కొట్టడం లాంటివి వీడియోలో కనిపిస్తున్నాయి.
"ఇది దిల్లీలోని పహర్గంజ్ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనపై ఆమె ఎలాంటి ఫిర్యాదు నమోదు చేయలేదు. జపాన్ రాయబార కార్యాలయంలో కూడా వీరిపై ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదు. ఈ విషయంపై మేం జపాన్ ఎంబసీని సంప్రదించాం. బాధిత యువతి నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని రాయబార కార్యాలయం నుంచి స్పందన వచ్చింది" అని పోలీసు అధికారి తెలిపారు. అయినప్పటికీ దిల్లీ పోలీసులు అసభ్యంగా ప్రవర్తించిన యువకులు పహర్గంజ్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఒక మైనర్ సహా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. నిందితులు తమ తప్పును ఒప్పుకున్నారు.
జపాన్ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వీడియోను ఒక వ్యక్తి తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయ్యింది. అమ్మాయి పట్ల ఆ యువకుల ప్రవర్తన చూసి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా ప్రవర్తించిన వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరారు.
ఆ వీడియోలో ఏముంది?
హోలీ రోజున యువకుల వీడియోలో.. యువకులు జపాన్ అమ్మాయిని అందరు కలిసి తోస్తూ ఆమెపై రంగులు చల్లారు. బలవంతంగా పట్టుకొని "హ్యాపీ హోలీ" అంటూ ఆమె తలపై గుడ్డు పగలకొట్టాడు ఓ యువకుడు. ఆమె వారి నుంచి ఎంత తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ వారు ఆమెను లాగుతూ అసభ్యంగా ప్రవర్తించారు. అమ్మాయి తప్పించుకొని వెళుతుండగా ఓ యువకుడు బైబై అంటూ అరిచాడు. అమ్మాయి మొత్తం తడిచిపోయి ముఖం అంతా కనిపించకుండా రంగులతో నిండిపోయింది.
అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించిన యువకులు ఎవరూ అని ఇంటెలిజెన్స్ ద్వారా గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ ఈ ఘటన చాలా బాధాకరం అని పేర్కొన్నారు. దీనిపై జాతీయ మహిళా కమిషన్ నోటీసులు పంపాలని ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి: