దేశంలో ప్రతిరోజు సగటున దాదాపు 80 హత్యలు జరుగుతున్నాయి. ఇందులో భూ వివాదాలు, కుటుంబీకుల మధ్య మనస్పర్థలు, గొడవలు అనంతరం హత్యలు ఇలా చాలానే ఉన్నాయి. అయితే దేశంలో జరుగుతున్న హత్యల్లో ఎక్కువ శాతం 'ప్రేమ'తో(Crime in India 2020) ముడిపడి ఉన్నవే. ఓ హత్య జరిగిందంటే దాని వెనుక ప్రేమ వ్యవహారమో, లేక అక్రమ సంబంధ పరిణామాలో ఉండే అవకాశాలే ఎక్కువ. ఏదైనా హత్య జరిగితే మొదట పోలీసుల దర్యాప్తు సైతం ఆ కోణంలోనే సాగుతుంది.
ప్రేమ విఫలైందని కోపంతో ప్రియురాలి హత్య, ఇతరులతో సన్నిహితంగా మెలుగుతోందని కక్ష పెంచుకొని హత్య, ఇష్టం లేని వ్యక్తితో వెళ్లిపోయిందని అమానుషం. ఇవేకాకుండా దేశంలో అక్రమ సంబంధాల హత్యలు కూడా అధికమే. ఈ విషయాన్నే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ఇటీవల విడుదల చేసిన 'క్రైమ్ ఇన్ ఇండియా ఇయర్ 2020'(Crime in India 2020 NCRB) నివేదిక వెల్లడించింది. గతేడాది దేశంలో నమోదైన 29,193 హత్యల్లో 3,031 హత్యలు ప్రేమ, అక్రమ సంబంధాలకు సంబంధించినవేనని పేర్కొంది.
ఈ తరహా హత్యలు 2010-2014 కాలంలో 7-8 శాతం మాత్రమే ఉండేవని.. కానీ ప్రస్తుతం అది 10-11 శాతానికి పెరిగిందని ఎన్‌సీఆర్‌బీ నివేదిక స్పష్టం చేసింది. ఈ హత్యల్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. బిహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో నమోదవుతున్న హత్యల్లో 15 శాతం ప్రేమ, అక్రమ సంబంధాలకు సంబంధించినవే ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. కేరళ, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ తరహా తక్కువగా నమోదవుతున్నట్లు ఎన్‌సీఆర్‌బీ తెలిపింది.
ఇదీ చదవండి:Rape statistics in India: అత్యాచారాలు, హత్యలు రాజధానిలోనే ఎక్కువ!