రాజస్థాన్, భరత్పుర్లో ప్రత్యేక జడ్జి జితేంద్ర గులియా 14 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితుడి తల్లి పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేసింది. జడ్జితో పాటు అతని ఇద్దరు సహాయకులు తన కుమారుడ్ని లైంగికంగా వేధిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తుపాకీతో కాల్చి చంపుతానని జడ్జి తమను బెదిరించినట్లు ఆరోపించారు.
'నా కుమారుడు ఏడో తరగతి చదువుతున్నాడు. 14 ఏళ్ల వయసుంటుంది. ఆటలాడుకునేందుకు రోజూ భరత్పుర్లోని మైదానానికి వెళ్తాడు. స్పెషల్ జడ్జి జితేంద్ర, అతని సహాయకులిద్దరూ అక్కడికే వస్తుంటారు. అక్కడే వారు నా కుమారుడితో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించారు. చిన్నారిని వాళ్ల ఇంటికి తీసుకెళ్లి మద్యం, మత్తుపదార్థాలు ఇచ్చేవారు. అనంతరం స్పృహ కోల్పోయాక బాలుడితో తప్పుడు చేష్టలకు పాల్పడేవారు. కేసు పెట్టొద్దంటూ నన్ను ఒత్తిడి చేశారు. కేసు పెడితే చంపేస్తామని బెదిరించారు' అని బాలుడి తల్లి ఆరోపించారు.
తమ ఇంటి బయట జడ్జి బాలుడితో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా చూశానని తల్లి పేర్కొన్నారు. అప్పుడే తనకు ఈ విషయం తెలిసిందన్నారు. వితంతువునైన తనను జడ్జి అతని సహాయకులు బెదిరించారన్నారు.
ఈమె ఫిర్యాదు మేరకు మథుర గేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫిర్యాదు సమయంలో పిల్లల సంక్షేమ కమిటీ అధ్యక్షుడు గంగారామ్ ఉన్నారు.
ఇదీ చదవండి: 'ఆమెకు తెలుసు చంపేస్తారని.. అయినా ఏనాడూ తలొగ్గలేదు'