Belagavi news: కర్ణాటక బెళగావిలో సంగోలి రాయన్న విగ్రహం సహా 26 ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేసిన హింసాత్మక ఆందోళనలకు సంబంధించి 27మందిని అరెస్టు చేశారు పోలీసులు. వీరిని వెంటనే కోర్టులో ప్రవేశపెట్టగా.. 14 రోజుల జ్యుడియల్ కస్టడీ విధించింది న్యాయస్థానం. అందరినీ హిందాల్జ జైలుకు తరలించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బెళగావిలో ఆదివారం ఉదయం 6గంటల వరకు 144 సెక్షన్ విధించినట్లు డీసీపీ విక్రమ్ అమతె తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Sangolli Rayanna statue vandalisation
బెంగళూరులో గురువారం సాయంత్రం ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని కొందరు దుండగులు అపవిత్రం చేశారు. విగ్రహంపై సిరా జల్లారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఆ మరునాడే(శుక్రవారం) బెళగావిలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. నిందితులను శిక్షించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే విధ్వంసం సృష్టించారు. సంగోలి రాయన్న విగ్రహంతో పాటు ప్రభుత్వానికి చెందిన 26 వాహనాలను ధ్వంసం చేశారు. బస్సులు, ఇళ్లముందు ఆగి ఉన్న కార్లపై రాళ్లు రువ్వారు. పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు నిరసనకారులపై లాఠీఛార్జ్ చేశారు. అనంతరం ఈ ఆందోళనలు నిర్వహించిన శ్రీరామసేన హిందుస్థాన్ సంస్థ అధ్యక్షుడు రమాకాంత్ కొండుస్కర్, మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి(MES) నాయకుడు శుభం శెల్కె సహా 27మందిని అరెస్టు చేసి కోర్టు ఆదేశాల మేరకు హిందాల్జ జైలుకు తరలించారు. ఈ ఘటనలకు సంబంధించి మొత్తం 100మందిపై మూడు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు.
karnataka belagavi
హింసాత్మక ఘటనపై సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు. హింసకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. బాధ్యాతాయుతమైన పౌరులు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడరని అన్నారు. శివాజీ మహారాజ్, సంగోలి రాయన్న, రాణి చెన్నమ్మ దేశాన్ని ఐక్యం చేశారని, వాళ్ల పేరుతో హింసకు దిగితే ఆ మహనీయులు చేసిన పోరాటానికి అన్యాయం చేసినట్లేనని వ్యాఖ్యానించారు. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు.
Tension in karnataka
మరోవైపు శివాజీ విగ్రహాన్ని అపవిత్రం చేయడాన్ని నిరసిస్తూ మహారాష్ట్ర కొల్లాపూర్లో శివసేన కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళనలకు దిగారు. పుణె- బెంగళూరు జాతీయ రహదారిపై కర్ణాటకకు చెందిన వాహనాలను నిర్బంధించారు. కర్ణాటక జెండాలను తగులబెట్టారు. కొల్లాపుర్లో వ్యాపారాలను కన్నడ ప్రజలే నిర్వహిస్తుంటారు. దీంతో శివసేన కార్యకర్తలు వాటన్నింటీని మూసివేయించారు. కర్ణాటక, మహారాష్ట్ర మధ్య చాలా ఏళ్లుగా సరిహద్దు వివాదాలున్నాయి. తాజా ఘటనతో అవి మరింత ముదిరాయి. సోలాపుర్లో కూడా కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. శివాజీ మహరాజ్ విగ్రహం ముందు నిరసనకారులు మానవహారంగా ఏర్పాడ్డారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు.
మహారాష్ట్రలో కర్ణాటకకు చెందిన వాహనాలను ధ్వంసం చేయడం, రిజిస్ట్రేషన్ నంబర్లకు నల్ల రంగువేయడం సరికాదని సీఎం బొమ్మై అన్నారు. ఆ రాష్ట్రంలో ఉన్న కన్నడిగులకు రక్షణ కల్పించడం, శాంతిభద్రతలు కాపాడటం అక్కడి ప్రభుత్వం బాధ్యత అన్నారు. ఈ విషయంపై మహారాష్ట్ర, కర్ణాటక హోంశాఖ కార్యదర్శులు, డీజీపీలు చర్చిస్తారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Drone BSF: సరిహద్దుల్లో డ్రోన్ కలకలం- పాకిస్థాన్ పనే!