అఖిల పక్షాలతో జమ్ముకశ్మీర్ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చలు పూర్తైన నేపథ్యంలో మరోసారి కేంద్ర కేబినెట్ విస్తరణ అంశం తెరమీదకు వచ్చింది. అంతకుముందు.. కొద్ది రోజుల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ... కేంద్ర మంత్రులు, భాజపా ముఖ్య నేతలతో రెండు సమావేశాలు నిర్వహించిన నేపథ్యంలో.. త్వరలోనే విస్తరణ ఉంటుందనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా దాదాపు 27 మంది కొత్తవారికి అవకాశం ఇవ్వాలని భాజపా అగ్రనాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
సింధియాకు అవకాశం..
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి కారణమైన జ్యోతిరాదిత్య సింధియాకు ఈసారి మంత్రివర్గ విస్తరణలో కేబినెట్ హోదా ఖాయంగా కనిపిస్తోంది. 2020లో కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరిన ఆయనకు సముచిత స్థానం కల్పించాలని భాజపా అధిష్ఠానం యోచిస్తోంది.
బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీని కూడా కేంద్ర కేబినెట్లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
విజయ వర్గీయకు మంత్రి పదవి..!
రాజస్థాన్‌కు చెందిన భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్, బంగాల్ భాజపా ఇన్‌ఛార్జి అయిన, మధ్యప్రదేశ్‌కు చెందిన కైలాశ్ విజయ వర్గీయ, భాజపా అధికార ప్రతినిధి, మైనారిటీ నేత సయ్యద్ జాఫర్ ఇస్లామ్ మంత్రివర్గ రేసులో ఉన్నారు. అసోం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణె, మహారాష్ట్ర బీడ్ ఎంపీ ప్రీతమ్ ముండే పేర్లను భాజపా పరిశీలిస్తోంది.
ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఎవరంటే..
వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు.. భాజపాకు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి ఉత్తర్‌ప్రదేశ్ భాజపా చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్, మహారాజ్‌గంజ్ లోక్‌సభ సభ్యుడైన పంకజ్ చౌదరి, వరుణ్ గాంధీ, ఎన్డీఏ భాగస్వామ్యపక్షమైన అప్నాదళ్ అధ్యక్షురాలు అనుప్రియ పటేల్‌న.. మంత్రిపదవి వరించే అవకాశం ఉందని సమాచారం.
ఒడిశా నుంచి లోక్‌సభ సభ్యుడు అశ్విని వైష్ణవ్, మాజీ ఎంపీ వైజయంత్ పాండా సహా రాజ్యసభ సభ్యుడైన అనిల్ జైన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బంగాల్ మాజీ రైల్వే మంత్రి దినేష్ త్రివేది కూడా ఈ జాబితాలో ఉన్నారు.
దిల్లీ ఏకైక భాజపా ఎంపీకి..
మోదీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన రాజస్థాన్‌కు చెందిన పీపీ చౌదిరిని మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. రాజస్థాన్‌లోని చరు ఎంపీ రాహుల్ కాశ్వాన్, సికర్ ఎంపీ సుమేదానంద్ సరస్వతి, దిల్లీ ఎంపీ మీనాక్షి లేఖి పేర్లను భాజపా అగ్రనాయకత్వం పరిశీలిస్తోంది.
బిహార్ నుంచి రేసులో..
బిహార్ నుంచి లోక్ జనశక్తి నాయకుడు దివంగత నేత రామ్ విలాస్ పాసవాన్ సోదరుడు పశుపతి పరాస్‌ను కూడా కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోనున్నట్లు సమాచారం. రామ్ విలాస్ పాస్‌వాన్ కుమారుడు చిరాగ్ పాస్‌వాన్ స్థానంలో లోక్ జన శక్తి జాతీయ అధ్యక్షుడిగా పరాస్ ఇటీవల ఎన్నికయ్యారు. జేడీయూ నుంచి ఆర్సీపీ సింగ్, సంతోష్ కుమార్ పేర్లను కూడా భాజపా అగ్రనాయకత్వం పరిశీలిస్తోంది.
కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్, గుజరాత్ భాజపా అధ్యక్షుడు సీఆర్ పాటిల్, అహ్మదాబాద్ పశ్చిమ ఎంపీ కిరీట్ సోలంకీ మంత్రివర్గంలో చోటు దక్కించుకోనున్నట్లు సమాచారం. హరియాణా నుంచి సిర్సా ఎంపీ సునీతా దుగ్గల్ మంత్రివర్గ రేసులో ఉన్నారు. వీరితో పాటు లద్దాఖ్ ఎంపీ జమయంగ్ సెరింగ్ నమ్గ్యాల్ కూడా మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అలా విస్తరణకు అవకాశం..
కేంద్ర మంత్రులు లోక్ జనశక్తి పార్టీ చీఫ్ రామ్ విలాస్ పాసవాన్, కర్ణాటక భాజపా నాయకుడు సురేశ్ అంగడి మరణంతో కేబినెట్ విస్తరణకు అవకాశం ఏర్పడింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు శిరోమణి అకాలీదళ్, శివసేన నాయకులు ఖాళీ చేసిన రెండు మంత్రి పదవులను కూడా భర్తీ చేయాల్సి ఉంది.
కేంద్రమంత్రి వర్గంలోని పలువురు... అదనపు బాధ్యతలను కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో... వీటిని కొత్త వారికి అప్పగించి కేబినెట్ హోదా కల్పించాలని భాజపా అగ్రనాయకత్వం యోచిస్తోంది. పరిశ్రమలు, వాణిజ్యం, న్యాయ, వ్యవసాయం, విద్యాశాఖ, పౌర విమానయానం, ఆహార శుద్ధి వంటి శాఖల్లో మార్పులు ఉండొచ్చని సమాచారం. అలాగే అంతగా ప్రభావం చూపని కొందరు మంత్రులను తొలగించి కొత్తవారిని తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇవీ చూడండి: