అచేతన స్థితిలో ఉన్న మహిళ(23) పండంటి శిశువుకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ బులంద్‌శహర్‌లో జరిగింది. ఏడు నెలల క్రితం ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ.. అచేతన స్థితిలోనే ఉండిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో మహిళ గర్భవతి. ఆమెను కుటుంబ సభ్యులు ఇంతకాలం జాగ్రత్తగా చూసుకున్నారు. ఆమె దిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ఏం జరిగిందంటే
మార్చి 31న మహిళ తన భర్తతో కలిసి బైక్‌పై బయటకు వెళ్లగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమె హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు బలమైన గాయం తగిలింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రాణాలు దక్కినా.. ఆమె మాత్రం అచేతన స్థితిలోనే ఉండిపోయింది. ఆమె కళ్లు తెరుస్తుందని, కానీ కదల్లేని స్థితిలో ఉందని దిల్లీ ఎయిమ్స్ న్యూరోసర్జరీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ దీపక్ గుప్తా తెలిపారు. "ప్రమాదానికి గురయ్యే సమయానికి ఆమె 40 రోజుల గర్భిణి. గైనకాలజిస్టుల బృందం పరీక్షించగా.. శిశువు ఆరోగ్యంగా ఉంది. అబార్షన్ చేసే అవకాశం లేదు. కుటుంబ సభ్యులను సంప్రదించగా.. వారు అబార్షన్‌కు ఒప్పుకోలేదు. తాజాగా ఆమెకు ప్రసవం చేయగా చిన్నారికి జన్మనిచ్చింది. మహిళ అచేతన స్థితిలో ఉండడం వల్ల పాలు ఇచ్చే ఆస్కారం లేదు. ప్రస్తుతానికి డబ్బా పాలే అందిస్తున్నాం." అని దీపక్ గుప్తా వివరించారు. ఆమె హెల్మెట్ ధరించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని చెప్పారు. భర్తే.. ఉద్యోగం మానేసి ఇంతకాలం ఆమె బాగోగులు చూసుకున్నాడని డాక్టర్ తెలిపారు.
ఇవీ చదవండి: సమాధిలోని చిన్నారి మృతదేహం నుంచి తల మాయం.. ఆ పూజల కోసమేనా?
నదిపై వంతెన కట్టిన గ్రామస్థులు.. అధికారుల అలసత్వానికి 'శ్రమదానం'తో పరిష్కారం